modi-notes-exchange-ban-november-24పెద్ద నోట్లను రద్దు చేసిన అనంతరం, డిసెంబర్ 30వ తేదీ వరకు ప్రస్తుతం చలామణిలో ఉన్న నోట్లను మార్చుకునే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించిన విషయం తెలిసిందే. తొలుత రోజుకు 4000 రూపాయలుగా నిర్ణయించగా, ఆ తర్వాత మరో 500 రూపాయలను పెంచి తీసుకున్న నిర్ణయం కాస్త, నేటి నుండి 2000 రూపాయలకు తగ్గిపోయిన సంగతులు తెలిసినవే. దీనిపై ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నప్పటికీ, ప్రభుత్వం ఎక్కడా వెనుకడుగు వేసే ఉద్దేశం కనపడకపోగా, మరిన్ని సంచలనాత్మకమైన నిర్ణయాలతో ముందడుగు వేయనుందన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా మీడియా వర్గాలలో హల్చల్ చేస్తున్న సమాచారం ప్రకారం… ప్రస్తుతం రోజుకు 2000 రూపాయలుగా ఉన్న నోట్ల మార్పిడిని పూర్తిగా రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. అదే జరిగితే నల్లకుభేరుల గుండెల్లో మరో “అణుబాంబు” పేల్చినట్లే అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. ప్రస్తుతం అమలులో ఉన్న మార్గం ద్వారా బ్యాంకు అధికారులతో నల్లకుభేరులు ఒప్పందాలు కుదుర్చుకుని పాత నోట్లతో కొత్త నోట్లను మార్చుకుంటున్నారన్న సమాచారంతో, ఈ నోట్ల మార్పిడికి ప్రభుత్వం ‘శుభంకార్డు’ వేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

వీలైనంత త్వరగా ఈ నిర్ణయాన్ని ప్రధాని అమలు చేయాలని చూస్తున్నారని, కుదిరితే ఈ 24వ తేదీ లోపునే ఈ మార్పిడి నిర్ణయాన్ని రద్దు చేసే అవకాశం కనపడుతోందని మీడియా వర్గాలు ఘోషిస్తున్నాయి. ఈ నిర్ణయం వెలువడితే మరోసారి దేశం అట్టుడికిపోవడం ఖాయం. అప్పుడు ఉన్న డబ్బంతా బ్యాంకు అకౌంట్ లలోనే జమ చేసి, ఆ తర్వాత డెబిట్ కార్డుల ద్వారా గానీ, విత్ డ్రాల రూపేణా గానీ బ్యాంకుల నుండి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి అకౌంట్లలోకి పెద్ద మొత్తం చేరితే… ఐటీ విభాగం ఎలాగూ కాచుకుని కూర్చుంది గనుక, ఆ మొత్తంపై లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. చూడబోతుంటే… నల్లధనంపై మోడీ పెద్ద యుద్ధమే చేయబోతున్నాడని అర్ధమవుతోంది.