modi government announces 1000 crores help to chennai“అయినోళ్ళకు ఆకుల్లో… కానోళ్ళకు కంచాల్లో…” అన్న తెలుగు సామెత గుర్తుందా..! సరిగ్గా ఇదే తీరును కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. తమ ప్రభుత్వంలో భాగస్వామి అయిన ఆంధ్రప్రదేశ్ కు ‘మొండిచేయి’ చూపిస్తూ, ఏపీ పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకు మాత్రం ‘అభయ హస్తం’ చూపుతోంది. చెన్నైకు ఎప్పుడూ లేనంత కష్టం వచ్చిపడింది. గత రికార్డులను తుడిచి పెడుతూ వర్షపాతం చెన్నైను చుట్టుముట్టింది. దీనికి స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ 1000 కోట్ల ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది.

నిజానికి ప్రస్తుతం చెన్నై ఉన్న పరిస్థితికి ఎలాంటి సహాయమైనా చేయాల్సిందే. మానవతా దృక్పధంతోనే కాదు, కష్టంలో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ప్రకటించిన 1000 కోట్లే కాదు, మరిన్ని నిధులిచ్చి చెన్నైను గట్టేక్కించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కానీ, ఇలాంటి సందర్భాలలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు గమనిస్తే ఏపీపై కేంద్రం చూపుతున్న ‘వివక్ష’ కళ్ళకు కట్టినట్లు కనపడుతుంది.

ప్రస్తుతం చెన్నై మాదిరే గత ఏడాది విశాఖలో ‘హుద్ హుద్’ విలయ తాండవం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం 65 వేల కోట్లు నష్టం వాటిల్లగా, కేంద్ర ప్రభుత్వం 21 వేల కోట్లుగా తేల్చింది. అయితే ఈ సందర్భంలో విశాఖ విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, 1000 కోట్లను తక్షణ ఆర్ధిక సహాయంగా ప్రకటించింది. ఆ ప్రకటన అయితే వచ్చింది కానీ, కేంద్రం విడుదల చేసింది మాత్రం కేవలం 380 కోట్లు మాత్రమే. అప్పటినుండి ఇప్పటివరకు విశాఖ విలయానికి ‘ఒక్క రూపాయి’ కూడా మంజూరు చేయలేదు. తక్షణ ఆర్ధిక సాయంలోనే కోత పెట్టిన మోడీ సర్కారు, అసలు సాయం సంగతి జాడే లేకపోయింది.

‘హుద్ హుద్’ ద్వారా ప్రకృతి సృష్టించిన బీభత్సాన్ని మరిచిపోయారేమో గానీ, కేంద్రం తీరును మాత్రం జీర్ణించులేకపోతున్నారు. దీనికంతటికి కారణం… రాజకీయ పరమైన అంశాలే అని విశ్లేషకులు తేల్చేస్తున్నారు. తమిళనాడులో ఏ ప్రభుత్వం ఉన్నా, కేంద్రంలో అధికారంలోనున్న ప్రభుత్వం నుండి వీలైనంత లబ్ధి పొందడంలో ముందుంటుంది. ఆయా కేంద్ర ప్రభుత్వాలు కూడా తమిళనాడుకు అంతే సహకారం అందిస్తుంటాయి.

తెలుగు వారు కాస్త సౌమ్యంగా వ్యవహరిస్తుండడంతో “మెత్త వారిని చూస్తే ఒత్త బుద్ధవుతుందన్న” చందంగా తెలుగు రాష్ట్రాల పట్ల ‘సీత కన్ను’ వేయడం కేంద్ర ప్రభుత్వాలకు పరిపాటిగా మారింది. ఏది ఏమైనా గానీ… తమిళనాడు తమిళనాడే అనిపించుకుంటోంది… అది భాష పై ప్రేమలో అయినా… రాజకీయ చక్రాలు తిప్పడంలో అయినా..! ఆ మాటకొస్తే ఎందులో అయినా..!