modi-demonetisation-8-lakhs-crores-junkనవంబర్ 8వ తేదీ సాయంత్రం 8 గంటలకు… మీడియాలన్నీ 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లుగా ఓ సంచలనమైన వార్తను ప్రసారం చేసాయి. అంతే… ఆ మరుక్షణమే ప్రజలందరికీ ఈ వార్త దావానంలా పాకిపోయింది. అప్పట్లో దీని గురించి ఆలోచించే కన్నా, ఉన్న డబ్బును ఎలా బ్యాంకులలో డిపాజిట్ చేయాలా? అన్న దానిపైనే ప్రజలు దృష్టి కేంద్రీకరించారు. అయితే మోడీ చెప్పిన విధానాన్ని బట్టి, నల్లకుభేరులను వెలికి తీసేందుకు ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారని జనాలలో ఎక్కువ శాతం మంది అభిప్రాయ పడ్డారు, మోడీ నిర్ణయానికి ‘జై’ కొట్టారు.

అవును… మోడీ ప్రకటించిన తొలినాళ్ళల్లో ఎక్కువ శాతం మంది ప్రజానీకం ప్రధాని వెంట నిలిచింది. కానీ, రోజులు గడుస్తున్నాయి. ఇవాళ కాకపోతే రేపు… రేపు కాకపోతే మరుసటి రోజు… అన్నట్లుగా ఘడియలు గడుస్తున్నాయి కానీ, సామాన్యుల కష్టాలు మాత్రం తీరకపోవడంతో ఒక రకంగా ప్రజలలో అసహనం పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం… ఎవరినైతే టార్గెట్ చేసుకుని ప్రధాని మోడీ తన అస్త్రాన్ని ఎక్కుపెట్టారో, అది కాస్త గురి తప్పి సామన్యుడ్ని బలిగొంది. దీంతో అంతకంతకూ సామాన్యులలో అసహనం పెరిగిపోతోంది.

అయితే ఇవేవో ప్రతిపక్షాల విమర్శలు మాదిరి ప్రజలు స్పందించడం లేదు. ఖచ్చితంగా మోడీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అని చెప్తున్నా… తమ గోడు ఎవరికీ పట్టకపోవడం ప్రజానీకం తట్టుకోలేకపోతోంది. ఓ పక్కన 4 వేల కోసం, 2 వేల కోసం గంటల గంటలు క్యూలైన్ లో నిల్చుంటే… మరో పక్కన కట్టలు కట్టలు అక్రమ మార్గంలో బ్యాంకుల నుండి పక్కదారి పడుతున్న వైనంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఏవైతే చలామణిలో ఉన్న 14 లక్షల కోట్లలో 27వ తేదీ నివేదికల వరకు దాదాపుగా 8 లక్షల కోట్లు ఇప్పటికే బ్యాంకు ఖాతాలలో పడిపోయాయి.

ఇంకా మిగిలి ఉన్న 6 లక్షల కోట్లలో ఎంతవరకు చేరుతుందనేది ఆసక్తికరంగా ఉన్నప్పటికీ… నిపుణులు, ఆర్ధిక వేత్తల అంచనాల ప్రకారం మరో 5 లక్షల కోట్ల వరకు ఖచ్చితంగా చేరుతుందని భావిస్తున్నారు. అంటే ఒక లక్ష కోట్ల రూపాయల బ్లాక్ మనీని మాత్రమే కేంద్ర ప్రభుత్వం నిరోధించగలుగుతుందన్న మాట. వాస్తవానికి ప్రభుత్వం అంచనా వేసింది అంతకంటే ఎక్కువనే చెప్పాలి. అదే నిజమైతే నోట్ల రద్దు విషయంలో మోడీ సర్కార్ అవలంభించిన విధానంలో ఎక్కడ లోపం జరిగింది?

ఇంతవరకు ఏ ఒక్క సెలబ్రిటీ గానీ, రాజకీయ వేత్త గానీ బ్యాంకు వద్దకు వచ్చింది లేదు, మరి అలాంటప్పుడు ఇప్పటివరకు బ్యాంకు ఖాతాలలో జమ అయిన 8 లక్షల కోట్లు కేవలం సామాన్యులవేనా? ఈ మాట వింటే బహుశా మోడీకి కూడా నవ్వు రాక మానదు. మరి ఇంత సంచలన నిర్ణయం తీసుకున్నా… ఎవరినీ కట్టడి చేయలేనపుడు సామాన్యులను ఇబ్బంది పెట్టడం ఎందులకు? కేవలం ఫేక్ కరెన్సీని నియత్రించడానికా? దానికి ఇంత అర్ధంతరపు నిర్ణయాలు అవసరం లేదు. ఇక్కడే మోడీ సర్కార్ బొక్కా బోర్లా పడినట్లుగా సామాన్యులు అభిప్రాయ పడుతున్నారు.

బ్లాక్ మనీలో ఎక్కువ శాతం ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, క్రీడాకారులు వంటి వారికే పరిమితం. మరి వారిని అదుపు చేయలేని చర్య ఎవరిని ఉద్ధరించడానికి? ఒకవేళ ప్రభుత్వం ఊహించని విధంగా 14 లక్షల కోట్లల్లో దాదాపుగా 13 లక్షల కోట్ల కంటే ఎక్కువ గనుక బ్యాంకులలో జమ అయితే, మోడీ సర్కార్ తీవ్ర విమర్శల పాలవ్వక తప్పదు. అప్పుడు ప్రజా వ్యతిరేకత కూడా ఎక్కువయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఒక విధంగా నల్లకుభేరులకు ‘వైట్’ చేసుకునే సదుపాయాన్ని మోడీ కల్పించినట్లే అవుతుంది. ఈ పర్యవసానాలు కూడా మళ్ళీ సామాన్యులపైనే పడే అవకాశం ఉందని ఆర్ధిక వేత్తలు హెచ్చరిస్తున్నారు.