Narendra Modi Special Status, Narendra Modi AP Special Status, Narendra Modi Decision AP Special Status, Narendra Modi Andhra Pradesh Special Status Package‘ప్రత్యేక హోదా’ కోసం నవ్యాంధ్ర నుంచి ఎదురవుతున్న ఒత్తిడి నుంచి తప్పించుకునేందుకు కేంద్రం అత్యంత కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తోందన్న వార్తలు దేశ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఈ మేరకు పలు దినపత్రికలలో ప్రచురితమైన ఆసక్తికర కథనాలు షాక్ కు గురి చేసేలా ఉన్నాయి. సదరు కధనాలను పరిశీలిస్తే… ఇప్పటిదాకా దేశంలో వెనుకబడ్డ రాష్ట్రాల అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటిస్తోంది. ప్రత్యేక ప్యాకేజీలను పక్కనబెడితే… ప్రస్తుతం దేశంలో 11 రాష్ట్రాలకు “ప్రత్యేక హోదా” అమలవుతోంది.

ఇక రాష్ట్ర విభజనతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న ఏపీకి “ప్రత్యేక హోదా” ఇవ్వాలని అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, ప్రస్తుతం దీనిపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ మేరకు నవ్యాంధ్ర ప్రజలతో పాటు అధికార, విపక్ష పార్టీలన్నీ ప్రత్యేక హోదా గళాన్ని వినిపిస్తున్నాయి. అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే… తమకూ కావాలంటూ మరికొన్ని రాష్ట్రాలు కాసుకుని కూర్చున్నాయని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. దీంతో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఉన్నా… ఆ దిశగా కేంద్రం అడుగులు వేసేందుకు సాహసించడం లేదు.

ఈ క్రమంలో ఇప్పటికే ప్రణాళిక సంఘం, జాతీయ అభివృద్ధి మండలి వంటి కీలక విభాగాలను రద్దు చేసిన బీజేపీ సర్కారు… రాజకీయ ఒత్తిడులు తప్పించుకునే క్రమంలో ‘ప్రత్యేక హోదా’ను కూడా పూర్తిగా రద్దు చేస్తే సరిపోతుందన్న దిశగా యోచిస్తోందట. దీనికి సంబంధించి ఇప్పటికే కేటినెట్ ముందుకు ఓ ప్రతిపాదన కూడా వచ్చిందని సమాచారం. ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పేస్తే… ఏపీ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ‘ప్రత్యేక హోదా’ డిమాండ్లు వినిపించవు కదా అన్న కోణంలో మోడీ సర్కారు యోచిస్తోందని విశ్వసనీయ సమాచారం. ఇక ‘ప్రత్యేక ప్యాకేజీ’లతోనే ఏపీ సహా ఆయా రాష్ట్రాలను సంతృప్తి పరచి ‘ప్రత్యేక హోదా’ డిమాండ్ కు చెల్లుచీటి ఇచ్చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు దినపత్రికల కథనాల సారాంశం.