Modi Banned 500 1000 Notes Exchange2014 సార్వత్రిక ఎన్నికల ముందు వరకు ‘బ్లాక్ మనీ’పై ఉక్కుపాదం మోపుతామని, అవినీతి రాయుళ్ళ భరతం పడతానని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రచారం, హంగామా, ఎన్నికలు ముగిసిన తర్వాత సైలెంట్ అయ్యింది. దీంతో మోడీ చిత్తశుద్ధిపై సర్వత్రా సందేహాలు వ్యక్తమయ్యాయి. మరో వైపు ఎవరికి వారు స్వచ్చంధంగా బ్లాక్ మనీని ప్రభుత్వానికి అప్పగిస్తే… వారి పేర్లు బయటకు రాకుండా చూసుకుంటామని ఎప్పటికప్పుడు సమయాన్ని పెంచుకుంటూ వచ్చిన మోడీ ఎట్టకేలకు గత సెప్టెంబర్ తో ఆ అవకాశాన్ని కూడా క్లోజ్ చేసారు.

దీంతో ‘బ్లాక్ మనీ’పై వాతావరణం సర్దుమనిగినట్లుగా కనపడింది. కానీ, అసలు విషయం ముందున్నదని చంద్రబాబు నాయుడు వంటి ఒకరిద్దరికీ మినహా అందరికీ తెలియకపోవచ్చు. ఇటీవల చాలా సందర్భాలలో పెద్ద నోట్లను బ్యాన్ చేయాలని చంద్రబాబు ఎందుకు బహిరంగంగా మాట్లాడారో నేడు ప్రధాని మోడీ ప్రకటన వచ్చిన తర్వాత గానీ అర్ధం కాలేదు. 500, 1000 రూపాయల కరెన్సీ నోట్లను అర్ధంతరంగా రద్దు చేసినట్లు ప్రకటించిన మోడీ సర్కార్, ప్రస్తుతం ప్రజల మనుగడలో ఉన్న వాటిని మార్చుకునేందుకు డిసెంబర్ 30వ తేదీ వరకు సమయం ఇచ్చింది.

సామాన్యులకు ఈ నిర్ణయం ఏ మాత్రం బాధనిపించదు గానీ, పెద్దల గుండెల్లో ఓ అణుబాంబునే పేల్చారు మోడీ. సాధారణ ప్రజానీకం వద్ద ఉన్న కొంత మొత్తాన్ని మార్చుకునేందుకు నేటి నుండి దాదాపుగా 50 రోజుల పాటు సమయం ఉండడంతో సాధారణ ప్రజల నుండి పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కాకపోవచ్చు. కానీ, బ్లాక్ మనీని దాచుకునేది సామాన్య ప్రజలు కాదు, తలలు పండిన పెద్ద తలకాయలు కావడంతో, ఇప్పుడు వీటిని ఎలా మార్చుకోవాలా? అనే దానిపై తర్జనభర్జనలు పడడం సహజం.

వీటన్నింటికి తోడు బ్యాంకు లావాదేవీల పైన కూడా నియంత్రణ పెట్టడంతో తలలు పట్టుకోవడం నల్లదనం దాచుకున్న వారి వంతవుతోంది. వారానికి గరిష్టంగా 20 వేలు మాత్రమే డ్రా చేసుకునే విధంగా మరియు రోజుకు గరిష్టంగా 10 వేలు మాత్రమే ఏటీఎంల నుండి డ్రా చేసుకునే నిబంధనలు విధించడం మోడీ చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. అలాగే బ్యాంకులలో పెద్ద మొత్తంలో డిపాజిట్ చేయాలంటే ఖచ్చితంగా ఐడీ కార్డులు ఉండి తీరాలి. అయితే ఈ కఠిన నిర్ణయాలపై వెనక్కి తగ్గకుండా చెప్పినది చెప్పినట్లుగా అమలు చేయాలని ఆశిద్దాం.

ఈ రెండున్నర్ర సంవత్సరాల కాలంలో మోడీ తీసుకున్న అతి పెద్ద నిర్ణయంగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. చాప కింద నీరు మాదిరి జరిపిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ ను ఎక్కడా లీక్ కాకుండా చూడడంలో కూడా మోడీ సక్సెస్ సాధించారు. బ్లాక్ మనీని పెద్ద మొత్తంలో నిల్వ చేసుకున్న వాళ్ళు, వాటిని మార్చుకోని పక్షంలో, డిసెంబర్ 30వ తేదీ తర్వాత అవి చిత్తుకాగితాలుగా పరిగణించాల్సి ఉంటుంది. అయితే అంత మొత్తంలో మార్చుకోవడానికి కూడా వీలులేకుండా బ్యాంకు నిబంధనలను మార్పు తేవడం విశేషం.