రెండు తెలుగు రాష్ట్రాలలో ఎలా అయినా బీజేపీ జెండా ఎగురవేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీజేపీ అధినాయకత్వానికి, తెలంగాణాలో అప్పుడప్పుడు కాస్త సానుకూల ఫలితాలు వచ్చాయి గానీ, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పార్టీ దారుణమైన పరిస్థితిలోనే ఉందన్న విషయం స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా మరోసారి ప్రస్ఫుటమైంది.

నిజానికి ఈ ఎన్నికల ఫలితాలు సార్వత్రిక ఎన్నికలకు కొలమానంగా భావించలేం గానీ, కనీసం క్యాడర్ ఎంతవరకు ఉందన్న విశ్లేషణలకు మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఆ మాటకొస్తే ప్రాంతీయ పార్టీ జనసేన కంటే అధ్వానమైన ఓట్ల శాతంతో బీజేపీ ఉండడమనేది, అధిష్టానం ఊహల ప్రపంచం నుండి బయటకు రావాల్సిన తరుణంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఒకప్పుడు బీజేపీ సాధించిన సీట్లు కూడా టిడిపితో ఉన్న పొత్తుల వలన లభించినవే గానీ, సొంతంగా కనీసం ఒక్క సీటు కూడా సాధించుకునే స్థితిలో బీజేపీ లేదు. ప్రతిపక్షంగా రాష్ట్రంలో ఎదిగే అవకాశాలను అధిష్టానంతో పాటు స్థానిక రాజకీయ నాయకుల అనుసరించిన విధానంతో చెడగొట్టుకున్నారనేది పొలిటికల్ టాక్.

రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న తప్పుడు విధానాలకు పరోక్షంగా కేంద్రం సహకరించడం, అలాగే స్థానిక బీజేపీ నేతలు అధికార పార్టీని విమర్శించడానికి పెదవి విప్పకపోవడంతో ఒక విశ్వాసమైన పార్టీగా ప్రజల ఆదరణను చూరగొనడంలో విఫలమైంది. ఉండడానికి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుండి వెళ్లిన దిగ్గజ నేతలే ఉన్నారు గానీ, ఏ ఒక్కరికీ ప్రజాధరణ లేకపోవడం పెద్ద మైనస్.

యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న పవన్ బొమ్మ ద్వారా ప్రజల్లోకి వెళదామని భావించారు గానీ, ఇటీవల జరిగిన పరిణామాలతో పవన్ కూడా బీజేపీకి దూరమయ్యారనే టాక్ బలంగా వినపడుతోంది. బహుశా తమ రాజకీయ చాతుర్యతతో ఏపీపై ప్రత్యక్ష ప్రభావం చూపగలరు గానీ, అధికారం అందుకోవడంలో మాత్రం ఏపీలో బీజేపీ పప్పులుడకవ్ అన్న విషయం స్పష్టమైంది.

ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం మంజూరు చేయాల్సిన స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోవడం, రైల్వే జోన్ ను కేటాయించకపోవడం, రాజధాని అభివృద్ధికి సహకరించకపోవడం, గత ప్రభుత్వంలో నిధులు ఇవ్వడంలో జాప్యత వహించడం ద్వారా అభివృద్ధికి కుంటుపడడం వంటి పలు అంశాలు నేటి బీజేపీ అధోగతి స్థితికి గల కారణాలలో కొన్ని.

బహుశా ఈ విషయం అధిష్టానానికి అర్ధమైందో ఏమో గానీ, ఏపీ పర్యటనలో అమిత్ షా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పొత్తుల విషయంలో ఎవరూ నోరు మెదపవద్దని, టిడిపిని ఎక్కువగా విమర్శించవద్దని, అధికార పార్టీపై పోరాడుతున్న అమరావతి రైతులకు అండగా ఉండాలని సూచించారు.