Mobile_Anna_Canteen_in_Vizayanagaramఒకప్పుడు ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో పేద ప్రజలందరికీ కిలో రూపాయికే బియ్యం అందించి కడుపులు నింపారు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పేద ప్రజలకు నామమాత్రపు ధరకే కడుపు నిండా అన్నం పెట్టేందుకు అన్నగారి పేరిట ఎక్కడికక్కడ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ఆ తరువాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టగానే రాష్ట్రంలోని అన్నా క్యాంటీన్లన్నిటినీ మూసివేయించారు.

వాటితో టిడిపికి, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లకు పేరు వస్తుందనుకొంటే వాటి పేరు మార్చి తన తండ్రి రాజన్న పేరుతో నడిపించి ఉంటే ఎవరూ ఆక్షేపించేవారు కారు. కానీ వాటిని చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారు కనుకనే కోట్లు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను మూసివేయించి పేదల ఉసురుపోసుకొంటున్నారు. అయినా చంద్రబాబు నాయుడుపై ద్వేషంతో వేలకోట్లు ఖర్చుచేసి అమరావతిలో నిర్మిస్తున్న వందలాది భవనాలనే పాడుబెట్టినప్పుడు అన్నా క్యాంటీన్లను పాడుబెట్టడం పెద్ద లెక్కా? అని రాష్ట్ర ప్రజలు అనుకొంటున్నారు.

పేదలకు పట్టెడన్నం పెట్టలేకపోయినా కనీసం పెడుతున్నవారినైనా పెట్టనివ్వాలి. కానీ అమ్మ పెట్టదు… అడుక్కు తిననివ్వదన్నట్లుగా ఇటీవల స్వర్గీయ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా గుంటూరులో టిడిపి నేతలు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్‌ను జేసీబీతో కూలద్రోయించింది. అంటే ఎవరు ఏమనుకొన్నా తమ ప్రభుత్వం తీరు మారదని వైసీపీ ప్రభుత్వం మరోసారి నిరూపించుకొంది.

ఈ నేపధ్యంలో ఈరోజు మాజీ కేంద్రమంత్రి, టిడిపి సీనియర్ నాయకుడు అశోక్ గజపతి జన్మదినం సందర్భంగా విజయనగరంలోని వారి కోటలో మొబైల్ అన్నా క్యాంటీన్‌ వాహనాన్ని ప్రారంభించారు. బొబ్బిలి నియోజకవర్గం టిడిపి ఇన్‌-ఛార్జ్ బేబీ నాయన అందించే నిధులతో దీనిని నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా అశోక్ గజపతి మీడియాతో మాట్లాడుతూ, “ఏ మూడేళ్ళలో రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా పని చేసిందంటే అది రూ.8 లక్షల కోట్లు అప్పులు చేయడం మాత్రమే. అంత అప్పు చేసినా దాంతో రాష్ట్రంలో ఏమైనా అభివృద్ధి చేసిందా? అంటే ఏమీ కనబడదు. విద్యుత్‌ మీటరులో నిమిషనిమిషానికి రీడింగ్ మారిపోతున్నట్లు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అప్పు కూడా నిమిషానిమిషానికి పెరిగిపోతూనే ఉంది. ఆ వచ్చిన డబ్బంతా ఏమవుతోందో… ఎక్కడికి పోతోందో సిఎం జగన్మోహన్ రెడ్డికి ఆయన మంత్రులకే తెలియాలి. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన జగన్ చేతిలో రాష్ట్రాన్ని పెట్టినందుకే నేడు ఈ దుస్తితి నెలకొంది,” అని అన్నారు.

అన్నా క్యాంటీన్లు ఒకే చోట ఉంటాయి కానీ ఈ మొబైల్ క్యాంటీన్ ఎక్కడ జనం ఉంటే అక్కడికి వెళ్ళే వెసులుబాటు ఉంటుంది కనుక దీనికి మంచి ఆధరణ… దాంతో టిడిపికి మళ్ళీ మంచి పేరు వస్తుంది. అప్పుడు టిడిపి నేతలు మరిన్ని మొబైల్ క్యాంటీన్లు ప్రారంభించే అవకాశం ఉంది. కనుక జగన్ ప్రభుత్వం విజయనగరంలో అశోక్ గజపతిరాజు, బేబీ నాయన ప్రారంభించిన ఈ మొబైల్ క్యాంటీన్‌ను నడవనివ్వకపోవచ్చు. ఏదో ఓ కుంటిసాకుతో అడ్డుకొని స్వాధీనం చేసుకోవడం ఖాయం.