MM-Keeravani--Sye-Raaమెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా “సైరా నరసింహారెడ్డి” ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం కానున్న విషయం తెలిసిందే. దాదాపుగా 150 కోట్ల బడ్జెట్ పైనే పెట్టనున్న ఈ సినిమా కోసం దేశంలోని అత్యున్నత సాంకేతిక నిపుణులను ఎంపిక చేస్తున్న వైనం తెలిసిందే. ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులకు చోటు దక్కిన ఈ సినిమా సంగీత దర్శకుడు అంశం మాత్రం హాట్ టాపిక్ గా మారింది.

తొలుత ఏఆర్ రెహమాన్ పేరును అధికారికంగా ప్రకటించినప్పటికీ, ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతున్న నేపధ్యంలో… రెహమాన్ తప్పుకోవడంతో, అందరి చూపులు టీజర్ కు బ్యాక్ గ్రౌండ్ అందించిన థమన్ పైనే పడ్డాయి. అది కూడా అద్భుతంగా ఉండడంతో, అంతా పక్కాగా థమన్ అని ఫిక్స్ అయిపోయారు. కానీ సినిమా మార్కెటింగ్ కావాలంటే థమన్ సరిపోడనే ఉద్దేశంతో… “బాహుబలి” బ్యాక్ గ్రౌండ్ వీరుడు కీరవాణిని రంగంలోకి దించుతున్నట్లుగా తెలుస్తోంది.

గతంలో మెగాస్టార్ చిరంజీవి – కీరవాణి కాంబోలో బ్లాక్ బస్టర్ హిట్స్ ఉండడం ఈ సమాచారాన్ని మరింత బలపరిచేలా చేస్తోంది. అయితే కేవలం రాజమౌళి మరియు రాఘవేంద్రరావు సినిమాలను తప్ప, ఇటీవల కాలంలో బయట సినిమాలు చేయని కీరవాణి, ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. బరిలో ఉన్నది మెగాస్టార్ చిరంజీవి కావడంతో, పెద్దగా ఇబ్బందులు ఎదురుకాకపోవచ్చు అన్నది ట్రేడ్ న్యూస్.