MM-Keeravani-Apologizes‘బాహుబలి 2’ ప్రీ రిలీజ్ వేడుక ప్రారంభానికి ముందు, చిత్ర సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి సినీ వర్గీయులను ఉద్దేశించి కురిపించిన ట్వీట్ల వర్షం తెలిసిందే. తన కెరీర్ కు, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పలు విషయాలపై చేసిన ట్వీట్లు విమర్శలకు దారి తీయడంతో, దీనిపై తాజాగా వివరణ ఇచ్చుకున్నారు. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సలహా మేరకు ఇటీవల తాను చేసిన ట్వీట్లను తొలగించినట్టు కీరవాణి తెలిపారు.

ఇటీవల తాను చేసిన ట్వీట్లు చాలా మందిని బాధించాయని, తమ్మారెడ్డి భరద్వాజ వంటి పెద్దల సూచనల మేరకు వాటిని తొలగించానని పేర్కొన్నారు. ఐదు నిమిషాల పాటు బుర్ర లేని తన బుర్రను తమ్మారెడ్డి వాష్ చేశారని అన్నారు. తమ్మారెడ్డి లాంటి వారు మమ్మల్ని సరిదిద్దుతుంటారని… దర్శకులందరూ గొప్ప వారు, వినయ విధేయతలు కల్గిన వారేనని, తాను మాత్రం ఎప్పటికీ బుర్ర తక్కువ వాడినేనని, తాను తప్పా… అందరూ సృజనశీలురు, అణకువగా ఉండే వారేనని ఆయా ట్వీట్లలో పేర్కొన్నారు.

ప్రపంచంలో ఉన్న దర్శకులందరూ గొప్ప వాళ్లేనని, వాళ్లతో పని చేసేందుకు తాను పడి చస్తానని తెలిపిన కీరవాణి, అందరి కన్నా చివరి స్థానంలో ఉండే తాను ఓ బుర్ర లేని కంపోజర్ ని అంటూ ట్వీట్ చేయడం ఆశ్చర్యం గొలుపుతోంది. అయితే ఇవన్నీ తన తప్పును సరిదిద్దుకునే క్రమంలో చేసినవో లేక వ్యంగ్యంగా వ్యాఖ్యానించినవో అర్ధం కాని పరిస్థితి. వీటితో పాటు ఇండస్ట్రీలో ఉన్న రచయితల కొరతలపై కూడా కీరవాణి స్పందించారు. ముఖ్యంగా అనంత శ్రీరామ్ ను పక్కన పెట్టడంపై ఆవేదన వ్యక్తం చేసారు.