Somu Veerraju bjp andhra pradeshఎంకి పెళ్లి సుబ్బిశెట్టి చావుకు వచ్చినట్టు అయ్యింది బీజేపీ పరిస్థితి. వివరాల్లోకి వెళ్తే… అమరావతి కలను కాలగర్భంలో కలిపెయ్యడానికి ఆంధ్రప్రదేశ్ లోని అధికార పక్షం కృతనిశ్చయంతో ఉంది. మండలిలో బిల్లుని ఆపి టీడీపీ తాత్కాలికంగా బ్రేక్ వేసినా అది తాత్కాలికమే, మూడు నాలుగు నెలల తరువాతైనా మూడు రాజధానులు జరిగి తీరుతాయని అధికారపక్ష నేతలు చెబుతున్నారు.

మండలి రద్దు వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ కు నష్టమా? టీడీపీకి ఇబ్బందా? అనే చర్చ జరుగుతుండగా అసలు నష్టం బీజేపీకే. ఆ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్సీలు (సోము వీర్రాజు, మాధవ్‌) ఉన్నారు.. రద్దు ఖాయమైతే పదవులు కోల్పోతారు. ఇది ఓ రకంగా ఆ పార్టీకి ఒకింత ఇబ్బందికర పరిస్థితి అనే చెప్పాలి. ఎందుకంటే ఆ పార్టీకి అసెంబ్లీలో కూడా ప్రాతినిథ్యం లేదు.

రెండు ఎమ్మెల్సీ పదవులు పోతే.. బీజేపీ తరపున ప్రజల వాయిస్ చట్ట సభల్లో వినిపించే అవకాశం పోతుందన్నమాట. మండలి రద్దు నిర్ణయమూ అంత సులభం కాదనే చర్చ జరుగుతోంది. కేవలం అసెంబ్లీ మండల్ని రద్దు చేస్తూ తీర్మానం మాత్రమే చేయగలదని.. తర్వాత నిర్ణయం కేంద్రం చేతిలో ఉంటుందనేది వాదన.

పార్లమెంట్‌లో ఈ తీర్మానాన్ని ఆమోదించి.. రాష్ట్రపతికి పంపిస్తే అప్పుడు రద్దు అవుతుంది. అంటే పరోక్షంగా కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ చేతుల్లో రద్దు నిర్ణయం ఉంటుంది. తమకు కూడా రాజకీయంగా ఎంతో కొంత నష్టం కాబట్టి రద్దు అంశాన్ని కేంద్రప్రభుత్వం వీలైనంతగా లేటు చేసే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.