MLC Pilli Subashchandra Bose - MLC Mopidevi Venkata Ramanaశాసన మండలి రద్దుకు ఏపీ కేబినెట్ ఆమోదం లభించింది. మండలి రద్దుపై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి, చర్చించి.. తీర్మానం ఆమోదం పొందిన అనంతరం కేంద్రానికి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేస్తేనే మండలి రద్దవుతుంది. అంతేకాదు, పార్లమెంట్‌లోనూ బిల్లు ఆమోదం పొందాలి.

కేంద్రాన్ని ఎలాగైనా ఒప్పించి వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లుకు ఆమోదం పొందాలని వైఎస్సార్ కాంగ్రెస్ భావిస్తుంది. ఇది ఇలా ఉండగా ప్రస్తుత కాబినెట్ లో ఉన్న ఇద్దరు మంత్రులు – పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ మండలిలో సభ్యులుగా ఉన్నారు.

అసెంబ్లీలో శాసనమండలి రద్దు తీర్మానం ఆమోదం పొందిన అనంతరం ఈ ఇద్దరూ మంత్రి పదవులకు రాజీనామా చేసే అవకాశం ఉంది. అండగా ఉంటానని సీఎం జగన్.. మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు, మోపిదేవి వెంకట రమణకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. అవసరమైతే వారిద్దరినీ రాజ్యసభకు పంపుతా అని జగన్ హామీ ఇచ్చారట.

సీఆర్‌డీఏ రద్దు, రాష్ట్రంలో అధికార, పాలనా వికేంద్రీకరణ బిల్లుల వ్యవహారంలో శాసనమండలిలో చోటు చేసుకున్న పరిణామాలతో అధికారపక్షం విస్తుబోయింది. శాసనసభలో 175 స్థానాలలో 151 స్థానాలతో .. 80 శాతంపైగా సభ్యులను కలిగి బిల్లులను ఆమోదిస్తే.. శాసనమండలిలో తిరస్కరణకు గురికావడం ముఖ్యమంత్రికి మింగుడుపడలేదు. దీనితో మండలి రద్దుకు పూనుకున్నారు.