MLC Ananthababu కాకినాడలో దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటున్న ఎమ్మెల్సీ అనంత బాబుకి సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. తనవద్ద డ్రైవరుగా పనిచేసే సుబ్రహ్మణ్యంని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన ఎమ్మెల్సీ అనంత బాబుని ప్రతిపక్షాలు తీవ్ర ఒత్తిడి చేయడంతో పోలీసులు అరెస్ట్ చేసి ఈ ఏడాది మే 23వ తేదీన రిమాండ్ ఖైదీగా జైలుకి పంపారు.

అప్పటి నుంచి అతను బెయిల్‌ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. మొదట ఎస్సీ, ఎస్టీ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ వేస్తే తిరస్కరించింది. తర్వాత అక్టోబర్ నెలలో మరోసారి హైకోర్టులో బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోగా హైకోర్టు కూడా తిరస్కరించింది. దాంతో సుప్రీంకోర్టుని ఆశ్రయించగా ఆ పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టి బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. బెయిల్‌ షరతులను హైకోర్టు ఖరారు చేయాలని ఆదేశించింది. ఈ కేసుపై తదుపరి విచారణని మార్చి 14కి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది.

అనంతబాబు హత్య కేసులో జైలుకి వెళ్ళిన తర్వాత పార్టీ నుంచి బహిష్కరిస్తునట్లు వైసీపీ ప్రకటించింది. కానీ ఎమ్మెల్సీగా అనర్హత వేటు వేసేసేందుకు ప్రయత్నించకపోవడం గమనార్హం. నేటికీ కాకినాడ జిల్లాలో పలువురు వైసీపీ నేతలు అనంతబాబుని పార్టీలో ఉన్నట్లుగానే పరిగణిస్తున్నారు. ఇప్పుడు అతనికి బెయిల్‌ మంజూరు అవడం, మార్చి 14వరకు ఈ కేసు విచారణ వాయిదా పడినందున అనంతబాబు స్వేచ్చగా తిరగవచ్చు. కనుక అతను అతని అనుచరులు మళ్ళీ కాకినాడలో చెలరేగిపోవచ్చు. కనుక అతనిపై కేసు వేసిన సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.