MLC Anantha Babu new twist high courtకాకినాడలో దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అధికార పార్టీకి చెందినవాడైనందున ప్రభుత్వం, పోలీసులు ఆ కేసు నుంచి బయటపడేసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాల ఒత్తిడి మేరకు పోలీసులు అంతబాబుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినప్పటికీ అతనికి శిక్ష పడకుండా తప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు చేతిలో చనిపోయిన సుబ్రహ్మణ్యం తల్లితండ్రులు వీధి నూకరత్నం, సత్యనారాయణ హైకోర్టులో ఓ పిటిషన్‌ వేశారు.

వైసీపీ నేతల కనుసన్నలలో పనిచేస్తున్న పోలీసులు ఈ కేసులో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని భావించడం లేదని కనుక ఈ కేసును సీబీఐకి అప్పగించాలని సుబ్రహ్మణ్యం తల్లితండ్రులు న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర హోంశాఖ కార్యదర్శిని, డిజిపిని కలిసి ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరినప్పటికీ వారు పట్టించుకోలేదు కనుకనే హైకోర్టును ఆశ్రయించినట్లు వారు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ కేసులో ప్రతివాదులుగా కేంద్రహోంశాఖ, రాష్ట్ర హోంశాఖ కార్యదర్శులను, రాష్ట్ర డిజిపి, సీఐడీ డైరెక్టర్, విశాఖ సీబీఐ ఎస్పీ, తూర్పు గోదావరి జిల్లా సర్పవరం పోలీస్ స్టేషన్‌ హౌస్ ఆఫీసర్లను ప్రతివాదులుగా చేర్చారు. ఈ కేసు నుంచి వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబుని తప్పించడానికి పోలీసులు ఏవిదంగా ప్రయత్నించారో లిఖితపూర్వకంగా వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు కాకినాడ జిల్లా వైద్యఆరోగ్యశాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చింది. అయితే తమ కుటుంబంలో చీలిక సృష్టించి ఈ కేసును నీరు గార్చేందుకే తమ కోడలికి ఉద్యోగం ఇచ్చారని సుబ్రహ్మణ్యం తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ ఈ కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టు ఆదేశిస్తే, ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది.