MLC-Ananth-Babuకాకినాడలో దళిత యువకుడు సుబ్రహ్మణ్యంని అతికిరాతకంగా హత్య చేసి ఆర్నెల్లపాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో గడిపిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబుకి సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో బుదవారం జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా వందలాదిమంది అనుచరులు అక్కడకి చేరుకొని జైలు నుంచి బయటకి వచ్చిన అనంత బాబుకి జైకొడుతూ పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. ఆయన కూడా ఏదో ఘనకార్యం చేసి జైలుకి వెళ్ళివచ్చిన్నట్లు తనకు జేజేలు పలుకుతున్న అనుచరులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

దారిలో సాయిబాబా గుడి వద్ద ఆగు బాబాకీ దణ్ణం పెట్టుకొని వచ్చి మళ్ళీ ఊరేగింపులో పాల్గొన్నారు. ఆయన అనుచరులు “జై బాబు… జై జై బాబు…” అంటూ నినాదాలు చేస్తూ దారి పొడవునా ఆయనపై పూలు జల్లుతూ భారీ ర్యాలీగా ఆయనని నివాసం వరకు తోడ్కొని వెళ్ళారు. దారిలో ఓ అనుచరుడు ఆయనకి గజమాల వేసి తన అభిమానం చాటుకొన్నాడు.

ఒక దళిత యువకుడిని హత్య చేసి జైలుకి వెళ్ళి బెయిల్‌పై బయటకి వచ్చిన అనంత బాబుకి ఆయన అనుచరులు ఇంత ఘన స్వాగతం పలుకుతుంటే చూసి కాకినాడ ప్రజలు నివ్వెరపోయారు. కాకినాడ పోలీసులు కూడా ఆయన ఊరేగింపుపై ఎటువంటి అభ్యంతరం చేయకపోవడం విశేషం. అంటే పోలీసులు కూడా అనంత బాబుని వైసీపీ ఎమ్మెల్సీగా భావిస్తున్నారనుకోవచ్చు. మరి సుబ్రహ్మణ్యం కుటుంబానికి ఏవిదంగా న్యాయం జరుగుతుంది?