Vundavalli_Srideviవాల్తేర్ వీరయ్య సినిమాలో ‘నువ్వు శ్రీదేవివైతే… ఆ… అయితే?…నేను చిరంజీవినవుతా…” పాట మరోసారి పాడుకోవాలి. దీనిలో చిరంజీవి బదులు ‘నేను సజ్జలనవుతా…’అని మార్చి పాడుకోవాలి.

వైసీపీ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మొన్నటి వరకు ‘వైసీపీ ట్యూన్‌లో పైరేటడ్ సాంగ్స్’ పాడుతుండేవారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ చేసినందుకు సస్పెన్షన్ వేటుపడటంతో ఇప్పుడు సొంత ట్యూన్‌లో ఒరిజినల్ సాంగ్స్ పాడుతున్నారు.

ఇప్పుడు “నేను శ్రీదేవినైతే… సజ్జల రామకృష్ణారెడ్డి విలన్‌ అంటా…. ఆయన వలన నా ప్రాణానికి ప్రమాదం అంటా… అందుకే హైదరాబాద్‌ పారిపోయి వచ్చేశానంటా… లారీలారీ లారీలారీ…. లారీలారీలతో ఇసుకదందాలు చేస్తున్నారంతా… అమరావతిని దోచేస్తున్నారంతా….” అంటూ ఒరిజినల్ సాంగ్‌ పాడుతున్నారామె. కనుక ఆ పాటని క్లుప్తంగా చెప్పుకొంటే,

·జగన్‌ కొట్టిన దెబ్బకు నా మైండ్ బ్లాంక్ అయ్యింది. జగనన్నకు చెవులు మాత్రమే ఉన్నాయి. ఆయన చెప్పుడు మాటలు వింటారు. కానీ నిజానిజాలు తెలుసుకోరు.

·నేను, నా భర్త హైదరాబాద్‌లో సుప్రసిద్ద వైద్యులం. మాకు మా వైద్యవృత్తి ద్వారా ఎంతో పేరు ప్రతిష్టలు, డబ్బు సంపాదించుకొన్నాము. కనుక ఎమ్మెల్సీ ఎన్నికలలో చాక్లెట్లు, బిస్కట్లకు కక్కుర్తిపడే బ్యాచ్ కాదు మాది.

·వైసీపీ సస్పెన్షన్ వేటు వేయగానే, వైసీపీ గూండాల నుంచి నాకు బెదిరింపులు మొదలైపోయాయి. గుంటూరులో నా కార్యలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. వైసీపీ ప్రభుత్వ అవినీతిని బయటపెడతాననే భయంతో నాపై భౌతికదాడులు జరిగే ప్రమాదం ఉంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వలన నా ప్రాణాలకు ప్రమాదం ఉంది. అందుకే భయంతో హైదరాబాద్‌ వచ్చేశాను. నాకు ఏమి జరిగినా ఏపీ ప్రభుత్వానిదే బాధ్యత. నాకు ప్రమాదం లేదని పూర్తి నమ్మకం కలిగినప్పుడే మళ్ళీ ఏపీలో అడుగుపెడతా.

·డాక్టర్ సుధాకర్, డాక్టర్ అచ్చెన్నల్లాగా నేను ప్రాణాలు కోల్పోకూడదనే హైదరాబాద్‌ వచ్చేశాను.

·ఓ దళిత మహిళా ఎమ్మెల్యేనైనా నాకే ఏపీలో రక్షణ లేకపోతే ఇక సాధారణ మహిళల పరిస్థితి ఏమిటి?దిశ చట్టం, దిశ పోలీస్ స్టేషన్లు, జీరో ఎఫ్ఐఆర్‌లు ఉండి ఏం ప్రయోజనం?

·నేను గంజాయి వ్యాపారం చేస్తున్నాంటూ ఏపీ పోలీసులు నాపై అక్రమకేసులు బనాయించబోతున్నట్లు విన్నాను. కానీ నేను ఇటువంటి బెదిరింపులకి భయపడే వ్యక్తిని కాను. వైసీపీలో ఎవరైనా నాజోలికి వస్తే నేను జాతీయ మహిళా కమీషన్‌కు, ఎస్సీ, ఎస్టీ కమీషన్‌కు ఫిర్యాదు చేస్తా.

·అమరావతిలో కొందరు ప్రభుత్వ పెద్దలు ఇసుక, మైనింగ్ మాఫియా చేస్తున్నారు. నేను వారి బినామీగా ఉండనందుకు నాపై కక్ష కట్టారు. దళిత మహిళనైన నన్ను వేధించారు. అక్కడి నుంచి నన్ను అడ్డుతొలగించుకోవాలనుకొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల వంకతో నాపై వేటు వేసి అడ్డుతొలగించుకొన్నారు.

·టిడిపి, చంద్రబాబు నాయుడులది దోచుకో… దాచుకొనే విధానం అని మా వైసీపీ నేతలు ఆరోపిస్తుంటారు. కానీ అమరావతిలో మా పార్టీ నేతలే అయినకాడికి దోచేస్తున్నారు. రోజుకి ఎన్ని లారీలు ఇసుక తరలిపోతోందో అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ ఇసుక, మైనింగ్ మాఫియా సొమ్ము చివరికి ఎవరికి చేరుతోందో పార్టీలో అందరికీ తెలుసు.

·వైసీపీలోకి వచ్చినప్పుడు అమరావతే రాజధాని అని చెప్పారు. ఆ మాటలు నమ్మి నేనూ నియోజకవర్గంలో ప్రజలకు అదే చెప్పుకొని గెలిచాను. తర్వాత మావాళ్ళు మాట మార్చి మూడు రాజధానులంటుంటే, ప్రజలకు నా మోహం చూపించలేక చాలా అవస్థలు పడ్డాను.

·మూడు రాజధానులు వద్దు.. జై అమరావతి అంటా! అమరావతి రాజధానిగా చేయాలి. దాని కోసం పోరాడుతున్న రైతులకు నేను పూర్తి మద్దతు ఇస్తా.

·జగనన్న ఇళ్ళు… అది పధకం కాదు… అదో పెద్ద కుంభకోణం.

·వచ్చే ఎన్నికలలో 175 సీట్లు మనవేనంటూ ఐ-ప్యాక్, మీడియాలో వస్తున్న వార్తలన్నీ డబ్బులిచ్చుకొని వ్రాయించుకొంటున్నవే.

·వైసీపీలో అందరూ గడప గడపకి కార్యక్రమంలో ప్రజల వద్దకు వెళ్ళాలని జగనన్న క్లాస్ పీకుతుంటారు. కానీ నన్ను మాత్రం వెళ్ళనీయకుండా అడ్డుకొంటున్నారు. ఓ ఎమ్మెల్యే సొంత నియోజకవర్గంలో ప్రజలను కలిసేందుకు వీల్లేదంటే ఇది ఏ రాజ్యాంగం?

·మూడున్నరేళ్ళుగా బానిస సంకెళ్ళలో ఉన్నాను. ఇప్పుడు నేను స్వతంత్ర ఎమ్మెల్యేని. ఒకవేళ ఏదైనా పార్టీలో చేరేమాటయితే మీడియాని పిలిచి చెప్పి చేరుతా.

·వైసీపీకి తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.