MLA Vasupalli Ganeshతెలుగుదేశం నుండి ఇటీవలే బయటకు వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్. అనర్హత వేటు తప్పించుకోవడానికి గాను ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ కండువా కప్పుకోకుండా ఆయన కుమారులకు కప్పించారు. అయితే ఈరోజు విశాఖలో మీడియా ముందుకు వచ్చిన ఆయన రాజీనామాకు రెడీ అంటూనే చిత్రమైన వాదన తెరమీదకు తెచ్చారు.

“మనుసు చంపుకొని తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై విమర్శలు చేశాను. మనసు చంపుకొని తెలుగుదేశం పార్టీలో ఉండలేకపోయాను. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి నేను సిద్ధం. నాపై అనర్హత ఫిర్యాదు చేసుకోమనండి,” అంటూ ఆయన మీడియా ముందు సవాలు చేసారు.

ఇక్కడ చిత్రమైన విషయం ఏమిటంటే… ఒకసారి ఆయన మీద అనర్హత వేటు వేస్తే… ఇక వాసుపల్లి రాజీనామా చెయ్యాల్సిన అవసరం లేదు. అనర్హత గురించి టీడీపీ స్పీకర్ కు కంప్లయింట్ ఇవ్వొచ్చు అయితే దాని మీద నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం అధికారపార్టీ చెప్పు చేతల్లో ఉండే స్పీకర్ మాత్రమే. కావున అనర్హత గురించి జగన్ తో మాట్లాడుకోవాలి.

అసలు ఎవరినైనా అడగడం ఎందుకు? స్పీకర్ ఫార్మటు లో రాజీనామా చేస్తే సరి. ఇదంతా పక్కన పెడితే… ఉపఎన్నికలు ఎదురుకునే ధైర్యం లేదని జగన్ సమక్షంలో కండువా కప్పుకోకుండా చెప్పకనే చెప్పేశారు ఆయన. ఇప్పుడు మీడియా ముందు ఈ సవాళ్లు అన్నీ ఉత్తరకుమార ప్రగల్బాలే.