MLA Vasantha Venkatakrishna Prasadఅవును… వైసీపీలో చెడ్డీ గ్యాంగులు, బ్లేడ్ బ్యాచులు, తొట్టి గ్యాంగులున్నాయి. వాటితో మనం జాగ్రత్తగా ఉండాలి! ఈ మాట అన్నది మరెవరో కాదు… మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. గురువారం జి.కొండూరు మండలం వెల్లటూరులో కెడీసీసీ బ్యాంక్ నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మన పార్టీలో కొన్ని చెడ్డీ గ్యాంగులు, బ్లేడ్ బ్యాచులు, తొట్టి గ్యాంగులు తయారయ్యాయి. ప్రతిపక్షాలు మనల్ని ప్రశ్నించలేకపోతే పార్టీలో ఉండే ఈ తొట్టి గ్యాంగులు ఊరికో ఉలిపికట్టెని తయారుచేసి మన వైసీపీ నాయకుల మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ మన పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నాయి. మొన్న పొరపాటున నాకు మన పార్టీ వాడు ఒకడు ఫోన్‌ చేసి మన పార్టీ నేతల గురించి ఆ దొరెవడూ… వాడు మనకి చెప్పేటంతటివాడా? అంటూ నోటికొచ్చిన్నట్లు మాట్లాడాడు. అతను మాట్లాడిన మాటలు వింటే ఒళ్ళు కంపరం వచ్చేసింది. అతను చెప్పిందంతా విన్నాక నువ్వు ఎవరితో మాట్లాడాలనుకొన్నావు? ఎవరికి ఫోన్‌ చేశావో తెలుసా? అంటూ దులిపేస్తే సారీ సార్ నేను మనోడే అనుకొని మాట్లాడేశాను అంటూ ఫోన్‌ పెట్టేశాడు. అంటే మన నాయకులను దెబ్బ తీయడానికి పార్టీలో ఈ తొట్టిగ్యాంగులు ఏవిదంగా తెరవెనుక పనిచేస్తున్నాయో ఒక్క ఫోన్‌ కాల్‌తో నాకు అర్దమైంది. కనుక మనం అందరం పార్టీలో చెడ్డీ గ్యాంగులు, బ్లేడ్ బ్యాచులు, తొట్టి గ్యాంగులతో చాలా జాగ్రత్తగా ఉండాలి! లేకుంటే వాళ్ళు మనల్ని దెబ్బెసేస్తారు,” అని హెచ్చరించారు.

వైసీపీలో చెడ్డీ గ్యాంగులు, బ్లేడ్ బ్యాచులు, తొట్టి గ్యాంగులున్నాయి వాటితో పార్టీ నేతలు కూడా జాగ్రత్తగా ఉండాలని ఓ ఎమ్మెల్యే బహిరంగంగా పార్టీ నేతలకు చెపుతుంటే, వాటితో ప్రతిపక్షపార్టీలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నాయో ఊహించుకోవచ్చు. అయినా వైసీపీలో చెడ్డీ గ్యాంగులు, బ్లేడ్ బ్యాచులు, తొట్టి గ్యాంగులున్నాయని ఆ పార్టీ ఎమ్మెల్యే స్వయంగా చెపుతుంటే వచ్చే ఎన్నికలలో వారిని ఎన్నుకోవాలో వద్దో ప్రజలే నిర్ణయించుకోవాలి.