Mla Sidda Reddy Gadapa Gadapaku Program“నేను బటన్ నొక్కి సంక్షేమ పధకాలు ఇస్తాను… మీరు గడప గడపకి వెళ్ళి ఆ విషయం ప్రజలకు గుర్తుచేసి రండి చాలు 175 సీట్లు మనవే,” అని సిఎం జగన్మోహన్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలకు భుజం తట్టి పంపించారు. సిఎం జగన్, మంత్రులు చెప్పుకొంటున్నట్లు నిజంగా వైసీపీకి అంత ప్రజాధారణ ఉంటే వైసీపీ నేతలకు తోడుగా పోలీసులు, ఇన్‌స్పెక్టర్లు, పార్టీ కార్యకర్తలు అవసరమే లేదు. కానీ వారు లేకుండా ప్రజల ముందుకు వెళ్ళలేకపోతున్నారు… ఎందుకు?అన్ని సంక్షేమ పధకాలు ఇస్తున్నప్పటికీ అడుగడుగునా ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదురవుతున్నాయి ఎందుకు?

అసలు గడప గడపకి కార్యక్రమంలో ప్రజలకు మరింత దగ్గరవడానికే కానీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలపైకి దండయాత్రలా బయలుదేరి రావడం, అక్కడ ప్రజలు నిలదీసేసరికి వారిపై చిందులు వేయడం, వారిపై దౌర్జ్యన్యం చేస్తుండటంతో ఈ ఒక్క కార్యక్రమంతోనే ప్రజలలో మరింత వ్యతిరేకత పెరిగిపోయేలా ఉందని వైసీపీ నేతలే గుసగుసలాడుకొంటున్నారు.

శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డి ఈరోజు పట్టణంలోని 3వ వార్డులో గడప గడపకి కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు, మహిళలు ఆయనను అడ్డుకొని గట్టిగా నిలదీశారు. రోడ్లు వేస్తామని చెప్పి హామీలు ఇచ్చి ఎన్నికలలో గెలిచి ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు కనబడలేదని, ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయావని, మరి ఏ మొహం పెట్టుకొని మళ్ళీ వచ్చావని స్థానిక ప్రజలు నిలదీశారు.

దీంతో సహనం కోల్పోయిన సిద్దారెడ్డి కూడా వారిపి ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో పక్కనే ఉన్న పోలీసులు వారిని పక్కకు తోసి దారి కల్పించడంతో సిద్దారెడ్డి ముందుకు సాగిపోయారు. పలకరించదానికి వచ్చినప్పుడే ప్రజలు చీదరించుకొంటునప్పుడు ఇక ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వారి ముందుకు ఏవిదంగా వెళ్లగలరు?వాస్తవ పరిస్థితులు ఈవిదంగా ఉంటే వచ్చే ఎన్నికలలో వైసీపీకి 175 సీట్లు ఎలా వస్తాయి?