mla-roja-saitires-pawan-kalyan‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం వైసీపీ ఎమ్మెల్యే రోజాకేమీ కొత్త కాదు. తాజాగా మరోసారి తిరుపతి వేదికగా పవన్ పై సూచనలతో కూడిన విమర్శలు చేసారు రోజా. తిరుపతిలో జరిగిన అఖిల పక్ష నేతల నిరాహార దీక్షలో పాల్గొన్న రోజా, ‘ఇదే తిరుపతి వేదికగా నాడు వెంకన్న స్వామి సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని మోడీ, చంద్రబాబులను చెరొక పక్క పెట్టుకుని పవన్ చెప్పారని, ఇప్పుడేమో ఇంకా రెండున్నర్ర సంవత్సరాలు వేచిచూసే ధోరణి ఏంటని’ ప్రశ్నించారు.

‘ప్రజాసేవ చేయాలని రాజకీయాల్లోకి రావాలని ఆలోచించే పక్షంలో గోడ మీద పిల్లి మాదిరి తడవకో మాట మాట్లాడకుండా కొమరం పులి మాదిరి ప్రజాసమస్యలు పరిష్కరించేందుకు పోరాడాలని, అందుకోసం ఎన్టీఆర్ మాదిరి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి పవన్ రావాలని, ఇలా రెండున్నర్ర సంవత్సరాలకొకసారి రెండు మీటింగ్ లు పెడితే ఉపయోగం ఉండదని…’ ఒక రకంగా సూచనలు, సలహాలతో కూడిన విమర్శనాత్మక వ్యాఖ్యలు చేసారు ఈ నగరి ఎమ్మెల్యే.

ఇప్పటివరకు వైసీపీపై గానీ, జగన్ పై గానీ పవన్ ప్రత్యక్షంగా ఎలాంటి విమర్శలు గుప్పించకపోవడంతో, బహుశా భవిష్యత్తులో పవన్ తో కలిసి వెళదామనే ఆలోచనలతో, రోజా తన విమర్శల దాడిని తగ్గించినట్లుగా పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి. గత ఎన్నికలలో టిడిపి, బిజెపి విజయం వెనుక ‘ఉడత’ సాయమైనా ఉంది అని బల్లగుద్ది చెప్పిన పవన్ సహకారం కోసం వైసీపీ ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు కనపడుతోంది. మరి ‘జనసేన’ అధినేత మదిలో ఏముందో..?!