MLA Roja satire on Pawan kalyanఇప్పటివరకు ఉన్న ‘పార్ట్ టైం పొలిటిషియన్’ అన్న విమర్శలను తొలగించుకునే ఫిధంగా క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించనున్న పవన్ కళ్యాణ్, తనది ‘ఒంటరి పోరాటం’గా డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. దీంతో అధికార, ప్రతిపక్షాలతో సహా అందరిపై తనదైన శైలిలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్, ‘వారసత్వ’ రాజకీయాలపై జగన్ ను ఉద్దేశిస్తూ వేసిన పంచ్ లు హైలైట్ అయ్యాయి.

తండ్రి చనిపోతే కొడుకు ముఖ్యమంత్రి కావాలనుకోవడం ఎంతవరకు సమంజసం? తాను వారసత్వ రాజకీయాలకు విరుద్ధం… ముందుగా తానేంటో నిరూపించుకున్న తర్వాత ముఖ్యమంత్రి స్థానానికి పోటీ చేస్తే బాగుంటుందన్న భావన, వైసీపీ నేత రోజాకు కనెక్ట్ అయ్యింది. దీంతో మరోసారి పవన్ కళ్యాణ్ పై ఎదురుదాడి చేయడం రోజా వంతయ్యింది. పవన్ కళ్యాణ్ ను ఒక ‘ప్యాకేజ్ స్టార్’గా కీర్తిస్తూ రోజా విమర్శల వర్షం కురిపించింది.

ముందుగా వారసత్వ సినిమాలపై పవన్ మాట్లాడితే బాగుంటుందని, అసలు ‘ప్రజారాజ్యం’ పార్టీని మోసం చేసింది నువ్వు, అల్లు అరవింద్ లేనని తీవ్రస్థాయిలో మండిపడింది. అన్నకు 18 సీట్లు రాగానే గాలికి వదిలిపెట్టేసి, సినిమా షూటింగ్ లకు వెళ్లి అన్యాయం చేసావని, మీ చేతలకు, మాటలకు సంబంధం ఉండడం లేదని ఒక స్థాయిలో పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడింది రోజా.

అయితే పవన్ వ్యాఖ్యల్లో ఉన్న ‘లాజిక్’ను రోజా మిస్ అయ్యిందన్నది స్పష్టం. వారసత్వ రాజకీయాలకు విరుద్ధం అని చెప్పిన పవన్, ముందుగా తను నిరూపించుకుని పోటీ చేస్తే బాగుంటుందని కూడా చెప్పారు. అంటే పరోక్షంగా… జగన్ ఒక నాయకుడిగా నిరూపించుకోమని పవన్ సూచన చేసారు తప్ప, ప్రత్యక్షంగా జగన్ పై ఎలాంటి విమర్శలు చేయలేదు. అయినా రోజాకు విమర్శలతో పనేముందిలేండి… తాను విమర్శ చేయాలనుకుంటే… ప్రత్యర్ధులు ఏం మాట్లాడారు అన్నది ఈ వైసీపీ నేతకు అనవసరం కదా..!