MLA Rojaశ్రీశైలం దేవస్థానం బోర్డు చైర్మన్ గా చెంగారెడ్డి చక్రపాణిరెడ్డిని జగన్ సర్కార్ నియమించడంపై కలత చెందిన వైసీపీ ఎమ్మెల్యే రోజా పార్టీకి, పదవికి రాజీనామా చేస్తుందన్న ప్రచారం గత రెండు, మూడు రోజులుగా జోరుగా సాగిందన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ అంశంపై నగరి ఎమ్మెల్యే రోజా స్పందించారు.

అందరూ పల్లెలు వదిలి సిటీలకు వెళ్లి ఇల్లు కట్టుకుంటుంటే, తాను హైదరాబాద్, చెన్నైల నుండి వచ్చి నగరిలో ఇల్లు నిర్మించుకుని ఇక్కడే ఉంటున్నానంటే మీరు అర్ధం చేసుకోవాలని, తాను నగరి నియోజకవర్గం కోసం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నానో, మీ ఆడబిడ్డగా తాను ఇక్కడే చనిపోవాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు.

జగన్ పార్టీ పుట్టకముందు నుండి ఆయనతోనే ఉన్నాను, ఎన్నో అవమానాలు భరించాను, ఎప్పటికి ఆయనతోనే ఉంటాను, వైసీపీ తరపున రెండు సార్లు అసెంబ్లీకి వెళ్ళాను, ఎన్నో పోరాటాలు చేశాను, దీనికి జగన్ కు జీవితాంతం రుణపడి ఉంటానని, ఎవరో తప్పు చేసినోళ్లు పార్టీ నుండి వెళ్లారు గానీ, తాను పార్టీ నుండి వెళ్లాల్సిన అవసరం లేదని ఘంటాపథంగా చెప్తున్నాని అన్నారు.

ఇక సొంత పార్టీలోని వెన్నుపోటుదారులపై రోజా తీవ్రంగా స్పందించారు. వైఎస్సార్సీపీలో ఉంటూ వెన్నుపోటుదారులు ఎవరైతే నన్ను ఓడించాలని అనుకుంటున్నారో… వారి సహాయంతో గెలుద్దామని అనుకుంటున్నాడేమో ఆ మూతి మీద మీసం లేని… అంటూ బ్రేక్ ఇచ్చిన రోజా, “ఇంకా బూతులు వస్తాయి నాకు” అంటూ ముగించారు.

సొంత నియోజక వర్గంలో వెన్నుపోటుదారులు ఉన్నారని చెప్పడం రోజాకు ఇది మొదటిసారే కాదు. గతంలో అనేక సందర్భాలలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయినప్పటికీ ఆ ఇబ్బంది అలాగే ఉందని తాజా వ్యాఖ్యలతో కూడా స్పష్టమవుతోంది. జగన్ ను అంతగా అభిమానించే రోజా కోసం పార్టీలోని ఇతర నేతలను జగన్ నియంత్రించలేకపోతున్నారా? లేక ప్రత్యామ్నాయాలను ఉసిగొల్పుతున్నారా?