MLA Roja press meetసంచలనకరమైన వ్యాఖ్యలకు నిలయంగా నిలిచే వైసీపీ నేత రోజా మరోసారి మీడియా ముందుకు వచ్చి అదే రకమైన ప్రకటనలు చేసారు. “సస్పెన్షన్ పై స్పీకర్ తో మాట్లాడేందుకు వచ్చిన తాను చేతులు కట్టుకుని నిలబడిన సమయంలో తనను మార్షల్స్ కుక్కలా లాగేశారని… మహిళా ఎమ్మెల్యే అన్న కనీస మర్యాద లేకుండా తనను ఎత్తి వ్యాన్ లో పడేశారని… అంతటితో ఆగకుండా మీడియాకు తన ఫొటో దొరకకుండా చేయాలనే ఉద్దేశంతో మార్షల్స్ తన మీద కూర్చున్నారని” సంచలన ఆరోపణలకు తెరలేపారు.

అలాగే, ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన పోలీసులు, తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ సీనియర్ పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డిలను చూసి తనను ఇంకో చోటికి తరలించేందుకు యత్నించారని ఆరోపించారు. అయితే జగన్, తన పార్టీ ఎమ్మెల్యేలు నిలదీయడంతో తనను పోలీసులు ఆసుపత్రికి తరలించక తప్పలేదని ఆమె పేర్కొన్నారు. రోజా చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ కు దారి తీసాయి.

రోజా ఆరోపిస్తున్న విషయాలు వాస్తవమో, అవాస్తవమో గానీ, అధికార పార్టీని టార్గెట్ చేసేందుకు దారుణమైన ఆరోపణలు చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మార్షల్స్ పై రోజా చేసిన వ్యాఖ్యలు ఆమె మానసిక స్థితిని తెలియజేస్తోందని, గతంలో ఎవరూ, ఎన్నడూ కూడా ఇలాంటి ఆరోపణలు చేయలేదని, అసలు మార్షల్స్ అలా ప్రవర్తించరని మీడియా వర్గాల వేదికగా అసెంబ్లీ వర్గాలు కూడా వెల్లడిస్తున్నాయి.

జరిగిన తప్పును ఒప్పుకుని సరిదిద్దుకుంటే, అక్కడితో సమసిపోతుందని, తప్పు మీద తప్పు చేస్తూ రోజా తన రాజకీయ భవిష్యత్తును తానే బలి చేసుకుంటుందన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ఓ రకంగా జగన్ రాజకీయ భవిష్యత్తుకు రోజా జీవితం పణంగా పెట్టారన్న కధనాలు కూడా వెలువడుతున్నాయి.