mla roja opens veterinary medical shopప్రారంభోత్సవ కార్యక్రమాలకు ఒక ఎమ్మెల్యే రావాలంటే ఎన్నో లెక్కలు వేసేవారు. ముఖ్యంగా వెళ్తున్న కార్యక్రమం ఎమ్మెల్యే హోదాకు తగిన విధంగా ఉంటుందా? లేదా? అని ఆలోచించేవారు. నిజానికి ఎమ్మెల్యేలను ఆహ్వానం అందించే వారు కూడా అంతగా సంకోచించే వారు.

కానీ గడిచిన రెండేళ్లుగా ఏపీలో ఎమ్మెల్యేలు చేస్తోన్న ఓపెనింగ్స్ చూస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. బహుశా తాను ఎమ్మెల్యేగా ఉన్నానని ప్రజలకు తెలియడానికి ఏ చిన్న ఓపెనింగ్ కైనా ఎలాంటి బేషజాలు లేకుండా విచ్చేస్తున్నారు. వీటికి సంబంధించిన ఓపెనింగ్ షాట్స్ సోషల్ మీడియాలో రెండేళ్లుగా హల్చల్ చేస్తూనే ఉంటున్నాయి.

తాజాగా నగరి ఎమ్మెల్యే రోజా ఒక వెటర్నరీ మెడికల్ షాప్ ను ఓపెన్ చేసిన తర్వాత మెడికల్ షాప్ ముందు నిల్చుని ఇచ్చి పిక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఎవరి స్థాయికి తగ్గట్లుగా వారు పెట్టుబడులు పెట్టి బిజినెస్ చేస్తుంటారు కనుక ఇక్కడ మెడికల్ షాప్ ను తక్కువ చేసి చెప్పలేము.

కానీ ఒక ఎమ్మెల్యే సహజంగా ప్రజల్లో ఉండే అభిప్రాయం వేరు. పెద్ద పెద్ద కంపెనీలో, కోట్లు, లక్షల్లో పెట్టే పెట్టుబడులకు హాజరవుతుంటారు. కానీ వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం ఇలాంటి ఓపెనింగ్స్ కే సంబర పడిపోతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు అంటూ వస్తే, ఆయా నియోజక వర్గాలలో వారు ప్రారంభించే కార్యకలాపాలకు ఆహ్వానం అందిస్తుంటారు.

ఏపీలో పెట్టుబడులకు అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలిస్తోందని ప్రతిపక్షాలు చేస్తోన్న విమర్శలకు ఇలాంటి ఓపెనింగ్స్ ఫోటోలు మరింత బలాన్ని ఇస్తున్నాయి. గతంలో అయితే ప్రజలు కూర్చునే సిమెంట్ బల్లలు, కొత్తగా వేసిన రంగులు వేసిన కరెంట్ స్తంభాల ఓపెనింగ్ లకు కూడా వైసీపీ నేతలు హాజరైన పరిస్థితి ఉంది. బహుశా ఇంత దయనీయమైన పరిస్థితి ఏ ఇతర ఎమ్మెల్యేలకు వచ్చి ఉండకపోవచ్చు.

చేతిలో అధికారం అయితే ఉంది గానీ, కనీసం నియోజక వర్గంలో అభివృద్ధి కోసం ఒక్క నిర్ణయం కూడా సొంతంగా తీసుకునే అధికారం కూడా వైసీపీ ఎమ్మెల్యేలకు లేదన్న విమర్శలు పొలిటికల్ వర్గాల్లో రెండేళ్లుగా వినపడుతూనే ఉంటున్నాయి. అందుకనే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా అభివృద్ధి పనుల ఫోటోలకు తావు లేకుండా పోయింది.