MLA Roja gets relief from High Courtఒక ఏడాది పాటు అసెంబ్లీ సస్పెన్షన్ ఉదంతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో రోజా సంతోషంలో మునిగితేలుతోంది. ఏపీ ప్రభుత్వం తనకు చేసిన అన్యాయానికి హైకోర్టు న్యాయం చేసిందని మరోసారి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ వ్యాఖ్యలు చేసారు. అయితే ఇంతకీ ఈ ఎపిసోడ్ లో రోజాకు ఏపీ సర్కార్ చేసింది నిజంగా అన్యాయమేనా? లేక అసెంబ్లీ సాక్షిగా రోజా పలికించిన హావభావాలను పరిశీలించని కోర్టు సస్పెన్షన్ ను తాత్కాలికంగా తొలగించి న్యాయానికి అన్యాయం చేసిందా? అన్న విషయాలు స్పష్టం కావాలంటే తుది తీర్పు వచ్చేవరకు వేచిచూడాలి.

కానీ, రోజా సస్పెన్షన్ ప్రజలకు మాత్రం లాభం చేకూర్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ప్రజల డబ్బుతో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న రాష్ట్ర సర్కార్… గత కొన్ని సమావేశాలుగా వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ ప్రజాధనాన్ని వృధా చేసింది. కానీ, ప్రస్తుతం జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు మాత్రం సజావుగా జరిగాయి. తిట్లదండకమో… లేక సవాళ్ళ ప్రదర్శనో… ప్రసంగాలు ఏవైనా గానీ ప్రజా సమస్యలపై, రాష్ట్ర స్థితిగతులపై కాస్త చర్చ అయితే జరిగింది… ప్రజాధనానికి ఇంకాస్త న్యాయం కూడా జరిగింది.

అలాగే అక్కడక్కడ ఘాటు వ్యాఖ్యలు కూడా వినపడ్డప్పటికీ, రోజా మాదిరి ఎలాంటి అసభ్య పదజాలం గానీ, హావభావాలు గానీ ప్రదర్శించిన వారు లేకపోవడంతో సభ గౌరవం నిలిపినట్లయ్యింది. దీంతో రోజా సస్పెన్షన్ మాత్రం సభ సజావుగా జరగడానికి వినియోగపడిందంటూ విశ్లేషణలు వస్తున్నాయి. గత రెండేళ్ళ అసెంబ్లీ చరిత్రను పరిశీలిస్తే కాదనలేం మరి..!