MLA Roja displeased with YS Jagan--సామాజిక సమీకరణాలకు అనుగుణంగా 25 మందితో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్ కొలువు దీరింది. అయితే కేబినెట్‌లో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. గత ఐదు సంవత్సరాలుగా టీడీపీ ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటం చేశారు రోజా. సభలోనూ బయటా పార్టీ వాణిని గట్టిగా విన్పించారు. ఒక ఏడాది పాటు సభనుండి సస్పెండ్ కూడా అయ్యారు. ప్రభుత్వం తన మీద ఎన్నో కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని రోజా ఆరోపణ.

జగన్ కోసం ఇన్ని చెయ్యడంతో తనకు మంత్రిపదవి ఖాయమని, తనకు హోంమంత్రి పదవి వస్తుందని సన్నిహితులతో ఆమె చెప్పేవారట. అయితే సామాజిక సమీకరణాల రీత్యా రోజాకు జగన్ తొలి కేబినెట్‌లో చోటు దక్కలేదు. కేబినెట్ మంత్రుల పేర్లు ప్రకటించాక జగన్ ఆమెను పిలిచి కూడా మాట్లాడలేదట. రెండో తడవ అవకాశం ఇస్తారని పార్టీ వర్గాలు చెప్పినా ఆమె సమాధాన పడలేదట. దానితో ఆమె అలక పాన్పు ఎక్కి ఎవరికీ చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు.

దీనితో ఐదేళ్ళు పార్టీ కోసం పోరాడి అలిసిపోయా అని, ఇప్పుడు కొంత రెస్టు తీసుకుంటా అని, అనవసరంగా శత్రువులను పెంచుకొనని ఆమె సన్నిహితులతో వైరాగ్యంగా చెప్పారట. జగన్ ఆమెను పిలిచి మాట్లాడక పోతే పార్టీ, ప్రభుత్వం మంచి వాయిస్ ను కోల్పోతుందని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. అవసరమైతే ఏదైనా కీలక నామినేటెడ్ పదవి ఆమెకు కట్టబెట్టాలని వారు అంటున్నారట. అయితే రోజా విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి!. మరోవైపు ఆమెను మీడియా ముందుకు తెచ్చి నాకు ఎలాంటి బాధ లేదని చెప్పించే పనిలో ఉన్నారట.