MLA Roja canvoy attacked in her own constituencyనిన్న వైఎస్సార్ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజాకు సొంత నియోజకవర్గంలోనే చుక్కెదురు అయ్యింది. నగరి లో జరిగిన గ్రామ సచివాలయ ప్రారంభోత్సవానికి రోజా వచ్చారు. అయితే ఆమెను వారి పార్టీ కార్యకర్తలే అడ్డుకోవడం విశేషం. టీడీపీ నుంచి వచ్చినవారికే పార్టీలో ప్రాధాన్యం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నామినేటెడ్ పదవులు కూడా వారికే కట్టబెడుతున్నారని ఆరోపించారు. తాము ప్రతిపక్షంలో దశాబ్దం పాటు కష్టపడినా దానికి విలువ లేకుండా పోయిందని వాపోయారు. కార్యకర్తలు రోజా ను అడ్డుకోవడంతో అక్కడ కొద్ది సేవు పాటు గందరగోళం నెలకొంది. దీనితో పోలీసులు కలగజేసుకుని వారికి సర్దిచెప్పారు.

ఇది ఇలా ఉండగా సొంత వారే తనను ఇబ్బంది పెట్టడం, అది మీడియాలో విరివిగా రావడం జీర్ణించుకోలేదో ఏమో రోజా వారి మీద కేసులు పెట్టించారు. రోజా అనుచరుల ఫిర్యాదుపై స్థానిక పోలీసులు 37మంది పై కేసు నమోదు చేశారు. విచారణ జరిపి అరెస్టులకు సిద్ధం అవుతున్నారు పోలీసులు.

అయితే సొంత పార్టీ వారి మీదే కేసులు పెట్టడంతో నియోజకవర్గంలోని మిగతా కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. “ప్రతిపక్షంలో అంతా రోజా గెలుపు కోసం అలుపెరుగని పోరాటం చేసిన వారే. కేసులు దాకా వెళ్లడం మంచిది కాదు,” అని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ విషయంలో రోజా మాత్రం గట్టిగానే ఉన్నారని సమాచారం.