అసెంబ్లీ వేదికగా అనుచిత ప్రవర్తనతో హాట్ టాపిక్ గా మారిన రోజా ఉదంతం ఇటీవల కాలంలో కోర్టుల వేదికగా మలుపులు తిరిగిన విషయం తెలిసిందే. దీంతో పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రివిలేజ్ కమిటీ ముందుకు హాజరు కావడానికి కూడా అయిష్టత వ్యక్తపరిచిన రోజా మరో తప్పిదానికి పూనుకుందన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే కమిటీ ముందుకు హాజరై తమ తప్పు ఒప్పుకుని, భవిష్యత్తులో పునరావృతం చేయమని చెప్పిన పలువురి వైసీపీ నేతలను క్షమాపణలతో వదిలేసిన విషయం తెలిసిందే.
ఈ నేపధ్యంలో ప్రివిలేజ్ కమిటీ ముందుకు హాజరయ్యేందుకు ఏపీ సర్కార్ రోజాకు మరో అవకాశం కల్పించింది. అయితే ఈ సారైనా రోజా హాజరవుతారో లేదో అన్న సందేహం రాజకీయ వర్గాల్లో కలిగింది. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దీనిపై స్పందించిన రోజా… ‘ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరయ్యేందుకు తనకు ఎటువంటి అభ్యంతరాలు లేవని, ఖచ్చితంగా హాజరవుతానని, న్యాయవ్యవస్థపై నమ్మకముందని, చివరకు విజయం తనదే అన్న విశ్వాసాన్ని” వ్యక్తపరిచారు రోజా.
అయితే కమిటీ ముందు రోజా ఏం చెప్తుందో అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో కలుగుతోంది. ఇతర వైసీపీ నేతల మాదిరి తన తప్పును రోజా ఒప్పుకుంటుందా? లేదంటే ఎప్పటిలాగానే తన వితండ వాదాన్ని కొనసాగిస్తుందా? అన్నది వేచి చూడాలి.