Rachamallu Siva Prasad Reddyప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది వివేకా హత్య కేసు మాత్రమే. ఇప్పటికే భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ అవినాష్ రెడ్డిని కూడా అరెస్టు చేయబోతోంది. సీబీఐ ఉచ్చు బిగించింది. ఇక అవినాష్ రెడ్డి తప్పించుకోవడం అసాధ్యం. రేపో మాపో అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడం ఖాయం లాంటి వార్తలే ఇప్పుడు ప్రతీ న్యూస్ ఛానల్ లలో బ్రేకింగ్ న్యూస్.

అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్ట్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దుచేయడంతో అవినాష్ అరెస్ట్ ఖాయం అన్న వార్తలే వినిపిస్తున్నాయి. అయితే గురువారం అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. విచారణ అనంతరం హైకోర్ట్ ఇచ్చే డైరెక్షన్స్ ని బట్టే సీబీఐ యాక్షన్ ప్లాన్ ఉండబోతున్నట్లు తెలుస్తుంది.

అయితే అవినాష్ రెడ్డి పులివెందులకు చేరుకోవడం, అక్కడ ప్రజాదర్బార్ నిర్వహించడం. మరో పక్క వివేకా కుమార్తె సునీత, రాజశేఖర్ రెడ్డి లను సీబీఐ విచారణ చేస్తుండటం..ఇంకోపక్క అప్రూవర్ దస్తగిరిని జాగ్రత్తగా ఉండాలని సిబిఐ సూచించడం. అతని భద్రతపైన కూడా ఆరా తీయడం వంటి అంశాలతో అసలు ఎంజరగబోతుంది అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. జరుగుతున్న తతంగం చూస్తుంటే తమకు పూర్తిగా అనుమానం కలుగుతుందని.. అవినాష్ రెడ్డిని అకారణంగా అరెస్టు చేయాలనే కుట్ర జరుగుతోందని, ఇదంతా వెనక ఉండి నడిపిస్తుంది చంద్రబాబే అని ప్రొద్దుటూర్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపుతున్నాయి.

అవినాష్ రెడ్డిని నిందితుడిగా విచారించినంత మాత్రాన ఆయన నేరస్థుడు అయిపోడని, కుట్ర చేసి అవినాష్ ని కేసులో ఇరికించాలని చూస్తున్నారని రాచమల్లు ఘాటుగా స్పందించారు. ఒక వేళ అవినాష్ రెడ్డిని నేరస్థుడిగా రుజువు చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాకుండా శాశ్వతంగా రాజకీయాల నుండి వైదొలుగుతానని రాచమల్లు ప్రకటించారు. అంతేకాకుండా తనతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారని రాచమల్లు ప్రకటించారు.

నిజంగా అవినాష్ రెడ్డి నేరస్థుడిగా రుజువు అయితే 10 మంది ఎమ్మెల్యేలు శాశ్వతంగా రాజకీయ సన్యాసం
తీసుకుంటారన్నమాట అని సామాన్య ప్రజలు చర్చించుకుంటున్నారు.