MLA Kotamreddy Sridhar Reddy on MLA salaries hikeమంచి ఎవరు చేసినా అభినందించాలి… చెడు ఎవరు చేసినా ఏకిపారేయాలి..! ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితులలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల జీతాల పెంపు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల జీతం 95 వేల నుంచి 1.50 లక్షలకు, ఇంటి అద్దె భత్యం 25 వేల నుంచి 50 వేలకు, పింఛన్ 25 వేల నుంచి 50 వేలకు, కారుకు ఇచ్చే రుణ పరిమితి 10 లక్షల నుంచి 25 లక్షలకు పెంచాలని, రైల్వే కూపన్ల కింద లక్ష, పుస్తకాల కొనుగోలు కింద ఐదేళ్లకు గాను లక్ష ఇవ్వాలని ఆ నివేదికలో ప్రతిపాదించారు.

అయితే మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉన్న తెలంగాణాలో ఈ పెంపు సమర్ధనీయమే కానీ ఏపీలో మాత్రం ఒకటికి రెండు సార్లు పునరాలోచించుకోవాలన్న భావన సర్వత్రా వ్యక్తమయ్యింది. దీనిపై ప్రసంగించిన వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి… ఈ ప్రతిపాదనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు అన్నారు. ‘ప్రభుత్వం – ప్రతిపక్షం’ కలిసి తీసుకున్న ఈ నిర్ణయాన్ని తన అంతరాత్మ ప్రభోదాన్ని అనుసరించి వ్యతిరేకిస్తున్నానని కోటంరెడ్డి చెప్పడం మనస్పూర్తిగా అభినందించదగ్గ విషయం.

“ఒకవైపు రాష్ట్రంలో నిధులు లేవని చెబుతూ, ప్రజలు సహకరించాలని కోరుతూ…, ప్రజలను త్యాగాలు చేయాలి అని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెలేలు, ఎమ్మెల్సీలు జీతభత్యాలు ఎలా పెంచుతుంది? అంటే ప్రజలే త్యాగాలు చేయాలి గానీ ప్రజాప్రతినిధులు మాత్రం త్యాగాలు చేయరా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రభుత్వానికి నచ్చిన ఏదో ఒక నియోజకవర్గంలో ప్రజాప్రతినిధుల జీతాల పెంపుపై రెఫరెండం చేపట్టాలని… దీనికి అనుకూలంగా ప్రజలు ఓటేస్తే… తక్షణం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని కూడా సవాలు విసిరి తన చిత్తశుద్దిని చాటుకున్నారు. ప్రజావ్యతిరేక విధానాలు సరికాదని అన్న కోటంరెడ్డి, ప్రజాప్రతినిధులు జీతాలమీద ఆధారపడే బతుకుతున్నారా? అని నిలదీశారు.

పార్టీ పరంగా కాకపోయినా వ్యక్తిగతంగా ధైర్యంగా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పిన కోటంరెడ్డిని ఖచ్చితంగా అభినందించాల్సిందే. అంతేకాదు, ప్రజా రెఫరెండం పెట్టండి అంటూ ఇచ్చిన సూచన కూడా ఆహ్వానించదగ్గ పరిణామమే. తెలంగాణా రాష్ట్రంలో పెంపు జరిగింది కాబట్టి, ఏపీలోనూ పెంచాలన్న నిర్ణయమే తప్ప, నిజానికి ఈ పెంపు ఏపీ సర్కార్ నుండి సమర్ధించదగ్గ విషయం కాదు.