MLA Kotamreddy Sridhar Reddyరెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కట్టుగా అడుగులు ముందుకు వేస్తున్నారు. గత ఎన్నికలలో జగన్ గెలుపుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరోక్షంగా మద్దతు ఇస్తే… గెలిచిన తరువాత వారిద్దరూ తమ స్నేహాన్ని బాహాటంగా చూపిస్తున్నారు. తరచూ కలుస్తున్నారు, ఉమ్మడి ప్రాజెక్టులు అంటూ ముందుకు పోతున్నారు.

జగన్ మోహన్ రెడ్డి అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చిన భవనాలను కేసీఆర్ కు నజరానాగా ఇచ్చారు. అయితే ఇద్దరు ముఖ్యమంత్రులు ఇంత క్లోజ్ గా ఉంటుంటే వైఎస్సార్ కాంగ్రెస్ నెల్లూరు రురల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం ఒక ఇంటర్వ్యూలో కేసీఆర్ పై బాంబు పేల్చారు.

“నాకు టీఆర్ఎస్ లో చాలా మంది స్నేహితులు ఉన్నారు, నేను ఇలా అంటున్నా అని నన్ను తప్పుగా అనుకోకండి కానీ ఇది రాసిపెట్టుకోండి ‘తెలంగాణ లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బిజెపి అధికారం లోకి వస్తుంది’,” అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఘంటాపథంగా చెప్పారు. ఇది తెలంగాణలోని అధికారపక్షానికి షాక్ అనే చెప్పుకోవచ్చు.

అలాగే, ఆంధ్రప్రదేశ్ లో ఏమవుతుంది అనేదికూడా ఆయన చెప్పారు. “ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు ప్రధానంగా పోటీ వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉండబోతుంది. బీజేపీ ప్రధానప్రతిపక్షంగా ఉండబోతుంది. టీడీపీకి గతంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిలా ఉంటుంది,” కోటంరెడ్డి చెప్పడం విశేషం.