MLA Kotamreddy Sridhar Reddy
నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై దుర్గామిట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. గత రాత్రి ఎమ్మెల్యే సహా, అతడి అనుచరులు తనపై దాడి చేశారని జైమీన్‌రైతు పత్రిక ఎడిటర్‌ డోలేంద్రప్రసాద్‌ ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. జైమీన్‌రైతు పత్రికలో ఎమ్మెల్యే ఆగడాలు అంటూ గత కొద్ది కాలంగా వరుస కథనాలు వస్తున్నాయి. దీనితో ఎమ్మెల్యే ఆగ్రహించారట.

తన అనుచరులతో డోలేంద్రప్రసాద్‌ ఇంటికి వెళ్లి దాడికి యత్నించారని ఆరోపణ. కత్తి పట్టుకుని తనను చంపడానికి ఎమ్మెల్యే తన మీదకు వచ్చాడని అయితే ఆయన అనుచరులు ఆయనను బయటకు తీసుకుపోయారని… రేపు సాయంత్రం (అంటే ఈరోజు) కల్లా నిన్ను, నీ కుటుంబాన్ని హతమారుస్తాను అని ఎమ్మెల్యే హెచ్చరించారని డోలేంద్రప్రసాద్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను ఈ ఘటనలో చెంపదెబ్బ కొట్టారని, బయటకు లాక్కుని వెళ్లే ప్రయత్నం చేసారని కూడా ఆరోపించారు.

జూన్ నెలలోనే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వల్ల తనకు ప్రాణహాని ఉందని డోలేంద్రప్రసాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని ఆయన మీడియా ముందు చెప్పారు. ఈ ఘటన నెల్లూరులో పెద్ద ఎత్తున సంచలనం రేకెత్తించింది. ఇది ఇలా ఉండగా నెల క్రితమే ఫోన్ లో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఒక జర్నలిస్టు ను బెదిరిస్తున్న ఆడియో ఒకటి బయటపడిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో ఎవరో తన వాయిస్ ను మార్ఫ్ చేశారని చెప్పుకొచ్చారు ఆయన.