MLA Kodali Nani  Gadapa Gadapaku YSRCPవచ్చే ఎన్నికలలో 151 సీట్లు సాధించడమే లక్ష్యంగా మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘గడప గడపకు వైసీపీ’ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. మంత్రి పదవి పోయినప్పటి నుంచి ఇన్ని రోజులుగా సంతాపదినాలు పాటించిన మాజీ మంత్రి కొడాలి నాని నిన్న గుడివాడలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన ఓ శపదం చేశారు. గుడివాడ నియోజకవర్గం ఏ ఒక్క పేదవాడైనా తనకు ఇల్లు లేదని చెపితే తాను వచ్చే ఎన్నికలలో పోటీ చేయనని కొడాలి నాని భీకర శపధం చేశారు. అయితే మంత్రి పదవి ఊడగొట్టి బయటకు పంపిన సిఎం జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలలో కొడాలికి అసలు టికెట్ ఇస్తారో లేదోనని అనుమానాలు వ్యక్తం అవుతుంటే, కొడాలి ఈ శపధం చేయడం విడ్డూరంగా ఉంది.

కొడాలి నిజంగానే సమర్ధుడైతే ఆయనను మంత్రివర్గంలో నుంచి తొలగించేవారే కాదు కదా?ఇంకా కీలక పదవి కట్టబెట్టి ఉండేవారు కదా?కనుక టికెట్ వస్తుందో రాదో అనే ఆందోళనతోనే కొడాలి అప్పుడే టికెట్ పాట మొదలుపెట్టేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక కొడాలివారు మరో గొప్ప విషయం కూడా చెప్పారు. వచ్చే ఎన్నికలలో కూడా వైసీపీ 151 సీట్లు ఖచ్చితంగా గెలుచుకొంటుందని కనుక మిగిలిన 24 సీట్ల కోసమే టిడిపి, జనసేనలు పోటీ పడాల్సి ఉంటుందని అన్నారు. అంతే కాదు…సిఎం జగన్మోహన్ రెడ్డి జీవితాంతం ఏపీకి ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకొంటున్నానని అన్నారు. గడప గడపకు వైసీపీ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

నిజానికి వచ్చే ఎన్నికలలో ఎదురీత తప్పదని గ్రహించినందునే ఇప్పటి నుంచే వైసీపీ నేతలు గడప గడపకు తిరగాల్సి వస్తోంది. లేకుంటే ఎన్నికలకు ఆరు నెలల ముందుగా ఇటువంటి కార్యక్రమాలు పెట్టుకొని ఉండేవారు కదా?కానీ 151 సీట్లు గెలుచుకోవడం ఖాయం అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ పైగా ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగపరుచుకోవాలని కొడాలివారు విజ్ఞప్తి చేయడం మరీ విడ్డూరంగా ఉంది.

ఒకవేళ తమ వద్దకు వచ్చే వైసీపీ నేతలను ప్రజలు గుంతలు పడిన రోడ్ల మరమత్తుల గురించి, విద్యుత్‌ కోతలు, ఇంటి పన్ను, చెత్తపన్ను, విద్యుత్, ఆర్టీసీ ఛార్జీల పెంపు, పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుదల గురించి అడగడం మొదలుపెడితే మళ్ళీ గడప తొక్కలేరు కూడా. కనుక వైసీపీ నేతలు ముందుగా వీటన్నిటికీ సమాధానాలు సిద్దం చేసుకొని గడప తొక్కితే మంచిది. లేకుంటే ఓట్లు కాదు వాతలు పడే ప్రమాదం ఉంటుంది.