missile-launch in Avanigaddaఆంధ్రప్రదేశ్ పేరు ఇక దేశవ్యాప్తం కానుంది. ప్రతిష్ఠాత్మకమైన మరో ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఒడిశాలోని బాలసోర్‌ (వీలర్ ఐలండ్)కే పరిమితమైన క్షిపణి ప్రయోగ కేంద్రం ఇప్పుడు ఏపీలోనూ ఏర్పాటు కానుంది. కృష్ణాజిల్లా నాగాయలంక ప్రాంతంలోని గుల్లలమోదలో క్షిపణి ప్రయోగ కేంద్రం ఏర్పాటుకు కేంద్రం అంగీకరించింది. 154 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న ఈ ప్రయోగ కేంద్రానికి సంబంధించిన పనులు ఈ దసరా నుంచే ప్రారంభం కానున్నాయి.

ఈ ప్రాజెక్టుకు మొత్తం 160 కోట్లను కేటాయించగా, తొలి దశలో 600 కోట్లు ఖర్చు చేయనున్నారు. నిజానికి దేశంలో మరో క్షిపణి ప్రయోగ కేంద్రం అవసరమని డీఆర్‌డీవో నిపుణులు ఏడేళ్ల క్రితమే ప్రతిపాదించారు. నాగాయలంక మండలంలోని గుల్లలమోద ఇందుకు అనుకూలంగా ఉన్నట్టు గుర్తించారు. సముద్ర తీరానికి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో క్షిపణి పరీక్షలకు అనువుగా ఉంటుందని భావించిన నిపుణులు కేంద్రానికి ప్రతిపాదనల పంపారు.

క్షిపణి ప్రయోగం కేంద్రం ప్రతిపాదన రాగానే రాష్ట్ర ప్రభుత్వం మరో మాటకు తావు లేకుండా వెంటనే ఆమోదించింది. అందుకు అవసరమైన భూమిని కేటాయించింది. కొంత భూమి తగ్గడంతో అటవీశాఖ నుంచి తీసుకుని, దానికి మరో ప్రాంతంలో భూమి ఇచ్చింది. భూసేకరణ, నిర్వాసితులు వంటి చిక్కులు ఏర్పడినా ప్రభుత్వం వాటిని సమర్థంగా పరిష్కరించింది. మరోవైపు సుప్రీంకోర్టు గ్రీన్ బెంచ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖలు కూడా మరో రెండు మూడు రోజుల్లో ఆమోదం తెలపనున్నాయి.