misinter Mekathoti Sucharitha responds on power cuts in andhra pradeshఆంధ్రప్రదేశ్ లో వేసవి, వర్షా కాలం అనే తేడా లేకుండా విద్యుత్ కోతలు విధిస్తున్నారని ఒక పక్క సామాన్య ప్రజలు అంటుంటే అబ్బె అటువంటిది ఏమీ లేదని ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత అంటున్నారు. అసలు విద్యుత్ కోతలు లేవని, ప్రతిపక్షాలు పసలేని ఆరోపణలు చేస్తున్నారని ఆవిడ ఆరోపించారు. గృహ అవసరాలకు నిరంతరాయంగా, వ్యవసాయానికి 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు మంత్రి చెప్పుకురావడం విశేషం.

వర్షాకాలంలో చెట్లు పడిపోవడం, తీగలు తెగిపోవడం వంటి కారణాలతో స్వల్ప అంతరాయం ఏర్పడుతోందని.. వీటిని విద్యుత్ కోతలుగా భావించరాదని చెప్పారు. పైగా విద్యుత్ అంతరాయ శాతాన్ని గత ప్రభుత్వంతో పోల్చి చూస్తే గణనీయం తగ్గించగలిగామని ఆమె అన్నారు. విద్యుత్ కోతలకు నిరసనగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ప్రజలు రోడ్ల మీదకు రావడం మనం చూశాం. బహుశా వారంతా కూడా ప్రతిపక్షాల కుట్ర వల్ల తమ ఇళ్ళలో కరెంటు లేదని భ్రమపడుతున్నారేమో అని టీడీపీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ లో సోలార్, పవన విద్యుత్ ఉత్పాదన మొత్తంగా ఆపేయమని ప్రభుత్వం కంపెనీలకు మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. అదే సమయంలో చంద్రబాబు హయాంలో తెలంగాణాకు విద్యుత్ బకాయిల కారణంగా ఆపేసిన విద్యుత్ సరఫరా జగన్ ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించింది. దాదాపుగా 2014-15 నాటి స్థాయికి విద్యుత్ సరఫరా జగన్ ప్రభుత్వం పునరుద్దించింది. దీని కారణంగానే ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ కొరత ఉందని పలువురి ఆరోపణ.