M9News Top 10 Most Popular Stars In May 2023టాలీవుడ్ కు సంబంధించిన కవరేజ్ లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన మిర్చి 9 టాప్ 10 ఈసారి కూడా ఎన్నో ఆసక్తికరమైన సంగతులను తీసుకొచ్చింది. వ్యక్తుల గురించే కాదు విపరీతమైన చర్చకు దారి తీసిన సంఘటలను పొందుపరచడంతో ప్రత్యేకత సంతరించుకున్న ఈ శీర్షిక మే నెలలో ఎవరెవరు చోటు దక్కించుకున్నారో చూద్దాం

1. రామ్ చరణ్

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు విచ్చేసిన రామ్ చరణ్ తన స్పీచ్ తో ఆకట్టుకున్నాడు. జై ఎన్టీఆర్ అనేందుకు మొహమాటపడకుండా పెద్దాయన పట్ల గౌరవాన్ని చూపుతూనే మా బాలయ్య అంటూ తమకున్న అనుబంధాన్ని గుర్తుచేశాడు. అంతేకాదు చంద్రబాబునాయుడు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడంతో ఇటు టిడిపి పార్టీ వర్గాలతో పాటు నందమూరి అభిమానులు కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు

2. మహేష్ బాబు

తనకు సంబంధమే లేని సినిమా గురించి హాట్ టాపిక్ కావడం బహుశా మహేష్ బాబుకి ఇదే మొదటిసారి. ఛాయ్ బిస్కెట్ టీమ్ తో ఉన్న అనుబంధం దృష్ట్యా విడుదలకు ఒక రోజు ముందే ట్వీట్ చేయడం ఒక వర్గానికి ట్రిగ్గర్ పాయింట్ గా మారిపోయింది. చిన్న చిత్రాన్ని ప్రోత్సహించాలనే మహేష్ ఉద్దేశాన్ని ఇంకో కోణంలో అర్థం చేసుకున్న ఫ్యాన్స్ ఆ ట్రాప్ లో పడ్డారు. గుంటూరు కారం టీజర్ లో ఊర మాస్ అవతారంలో అన్నిటికి చెక్ పెట్టేశారు

3. ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ రెండు అంశాల్లో హైలైట్ అయ్యాడు. తాతయ్య సెనెటరీ సెలబ్రేషన్స్ కి రాకపోవడాన్ని కొందరు అభిమానులు ప్రాక్టికల్ సెన్స్ లో తీసుకోలేదు. దీంతో సోషల్ మీడియాలో చిన్నపాటి దుమారం రేపారు. బాలయ్య ఫాన్స్ తో కొన్ని ఆన్ లైన్ వాగ్వాదాలు జరిగాయి. కొరటాల శివ దర్శకత్వంలో రాబోయే దేవర ఫస్ట్ లుక్ లో తారక్ ఇంటెన్స్ లుక్స్ మూవీ లవర్స్ కి బాగా కనెక్ట్ ఆయ్యాయి.

4. అనసూయ

సినిమా పోస్టర్ లో విజయ్ దేవరకొండ పేరు ముందు ది అని పెట్టుకోవడం పట్ల వ్యంగ్యంగా కౌంటర్ వేసిన అనసూయకు ఈసారి నెటిజెన్ల మద్దతు అంతగా దక్కలేదు. అదేదో పెద్ద సమస్య అయినట్టు పదే పదే ఆ టాపిక్ ని తీసుకురావడం, దురుసుగా స్పందించిన వారి స్క్రీన్ షాట్లు షేర్ చేసుకుని నిందించడం గతంలోలా సాఫ్ట్ కార్నర్ తీసుకురాలేదు. ఈసారి తన బుల్లెట్ మిస్ ఫైర్ అయిన మాట వాస్తవం.

5. విజయ్ దేవరకొండ

లైగర్ తాలూకు గాయాల నుంచి ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్న విజయ్ దేవరకొండకు ఖుషి ఖచ్చితంగా బ్రేక్ ఇస్తుందనే నమ్మకం ఫ్యాన్స్ లో బలంగా ఉంది. దానికి తగ్గట్టే హేశం అబ్దుల్ వహాబ్ కంపోజ్ చేసిన స్వీట్ మెలోడీ కొన్ని వారాలుగా చార్ట్ బస్టర్స్ లో ఉంది. ఓవర్ అగ్రెసివ్ పాత్రలకు సెలవిచ్చి కూల్ లవ్ ఎంటర్ టైనర్ తో వస్తున్న రౌడీ హీరోకు ఈసారి బ్రేక్ దొరకాల్సిందే

6. బండ్ల గణేష్

నేరుగా పేరు చెప్పకుండా గురూజీ అంటూ త్రివిక్రమ్ ని లక్ష్యంగా పెట్టుకుని బండ్ల గణేష్ వేసిన ట్వీట్లు చాలా వైరల్ అయ్యాయి. ఊరికే ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు సంబంధం లేకుండా మాటల మాంత్రికుడి ప్రస్తావన తీసుకురావడం సపోర్ట్ దక్కించుకోలేకపోయింది. కేవలం అటెన్షన్ రాబట్టుకోవడానికి చేసిన ప్రయత్నం తప్పించి ఎలాంటి ఫలితం దక్కలేదు

7. నాగ చైతన్య

ఏజెంట్ డిజాస్టర్ ని మర్చిపోయేలా అఖిల్ అన్నయ్య నాగ చైతన్య కస్టడీతో పెద్ద హిట్ ఇస్తాడని ఎదురు చూసిన అక్కినేని అభిమానులకు మళ్ళీ నిరాశే మిగిలింది. ఎప్పుడూ లేని కాన్ఫిడెన్స్ చైతు ఈ కస్టడీ విషయంలో చాలా చూపించాడు. అయితే కష్టమంతా నేలపాలైపోయింది. ఫ్లాపులు అందరు హీరోలకు సహజమే అయినా ఫ్యామిలీ మొత్తానికి ఒకేసారి వస్తే అదో న్యూసే

8. అనిల్ సుంకర

ఎంత ఫ్లాప్ అయినా సరే లేదు మా సినిమాకు డబ్బులొచ్చాయి ఎవరూ నష్టపోలేదని సమర్ధించుకునే రోజుల్లో నిర్మాత అనిల్ సుంకర రిలీజైన మూడో రోజే ఎలాంటి భేషజాలు లేకుండా ఏజెంట్ ఓటమిని బేషరతుగా ఒప్పేసుకుని సెన్సేషన్ సృష్టించారు. ఫ్యాన్స్ కి క్షమాపణ చెప్పడమే కాక పూర్తి బాధ్యతను తీసుకుని ఇకపై ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటానని చెప్పారు. పూర్తి స్క్రిప్ట్ చేతిలో లేకుండా షూటింగులు చేయొద్దనే స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు.

9. డింపుల్ హయతి

చెప్పుకోదగ్గ ఆఫర్లే వస్తున్నా హిట్టు తలుపు తట్టలేకపోతున్న హీరోయిన్ డింపుల్ హయతికి ఇటీవలే రామబాణం రివర్స్ లో గుచ్చుకుంది. ఇదేమీ అంత హైలైట్ అవ్వలేదు కానీ తానుండే అపార్ట్ మెంట్ పార్కింగ్ ప్లేస్ విషయంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ తో వివాదం కొని తెచ్చుకోవడం న్యూస్ ఛానల్స్ కి గంటల తరబడి ఫీడింగ్ ఇచ్చింది. సహజీవనం చేస్తున్న స్నేహితుడు బయటి ప్రపంచానికి కనిపించింది కూడా ఈ ఉదంతం లోనే.

10. టీజీ విశ్వప్రసాద్

కోట్లాది రూపాయల పెట్టుబడులు చేతిలో ఉన్నాయని వరసగా సినిమాలు తీసుకుంటూ పోతే క్వాలిటీ లేకుండా సరుకు మాత్రమే బయటికి వస్తుందని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఉదంతం చూసి చెప్పొచ్చు. రామబాణం ఒక ఉదాహరణ. దీని సంగతి పక్కనపెడితే ఆదిపురుష్ ని ఏపీ, తెలంగాణకు మతిపోయే మొత్తానికి హక్కులు ఈ సంస్థ కొనుగోలు చేయడం హాట్ టాపిక్ అయ్యింది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సినిమా ఈ నిర్మాణ సంస్థదే. స్పిరిట్ కూడా వీళ్ళే కొనేశారని టాక్