Top10_ Most_Popular_Stars_January_2023విశ్వసనీయతకు నిఖార్సైన వార్తలకు పేరుగన్న మిర్చి 9 ఈ సంవత్సరం నుంచి కొత్త ఫీచర్ ని అందుబాటులోకి తెస్తోంది. ప్రతి నెల బాగా పాపులర్ అయిన సెలబ్రిటీలు స్టార్లను వారి ఘనతను వివరించే కారణాలను మీ ముందుకు తెస్తోంది. ఇది జనవరితో మొదలు ఇకపై ప్రతి నెల కొనసాగుతుంది.

1. నందమూరి బాలకృష్ణ

నెల పొడవునా బాలయ్య వార్తల్లో ఉంటూనే వచ్చారు. బలమైన ప్రత్యర్థి, కంటెంట్ లో ఉన్న ఎగుడుదిగుడులతోనూ వీరసింహారెడ్డి రూపంలో కెరీర్ హయ్యెస్ట్ గ్రాసర్ సాధించడం మొదటి మైలురాయి. ప్రభాస్ ఆన్ స్టాపబుల్ ఎపిసోడ్ ని నడిపించిన తీరు దాని స్ట్రీమింగ్ కు ముందు విపరీతమైన బజ్ తీసుకొచ్చి యాప్ క్రాష్ అయ్యేలా చేసింది. అక్కినేని తొక్కినేని కామెంట్ల మీద సోషల్ మీడియాలో జరిగిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. లోకేష్ పాదయాత్రలో అనారోగ్యానికి గురైన తారకరత్నను కుప్పం నుంచి బెంగళూరు దాకా తీసుకెళ్లి బాబాయ్ గా వెన్నంటే ఉండిన తీరు జనాన్ని ఆకట్టుకుంది

2. చిరంజీవి

వాల్తేరు వీరయ్య రూపంలో బలమైన కంబ్యాక్ అందుకున్న చిరంజీవి ఏ మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో లేని ఒక రొటీన్ కంటెంట్ తో పండగ సీజన్ ని వాడుకుని భారీ కలెక్షన్ ని రాబట్టడం ద్వారా తన స్టార్ పవర్ రుజువు చేసినట్టయ్యింది. కానీ వరంగల్ లో జరిగిన సక్సెస్ మీట్ లో అవసరం లేకపోయినా రవితేజని చిన్న హీరో అని సంబోధించడం మాస్ మహారాజా అభిమానుల ఆగ్రహానికి కారణం అయ్యింది. ఇది నాన్ రాజమౌళి హిట్ అని చెప్పుకోవడం మరీ అతిశయోక్తిగా అనిపించి కొంత నెగటివిటీని తెచ్చిన మాట వాస్తవం. ఈ రెండు అంశాలే హైలైట్ కావడంతో బాలయ్య కంటే ఒక స్దానం వెనుకబడాల్సి వచ్చింది

3. ఎంఎం కీరవాణి

సగటు ఇండియన్ ఫిలిం మేకర్స్ కలగా భావించే రెండు గొప్ప ఘనతలను కీరవాణి సాధించారు. నాటు నాటుకి పాటకు గోల్డెన్ గ్లొబ్ అందుకోవడం ప్రధానితో మొదలుపెట్టి సాధారణ నెటిజెన్ దాకా అందరి చేత శభాష్ అనిపించుకునేలా చేస్తే ఉత్కంఠభరితంగా సాగిన ఆస్కార్ నామినేషన్స్ లో చోటు దక్కించుకోవడం మరో మెట్టు పైకెక్కించింది. లేట్ ఏజ్ లోనూ తన సత్తా చాటిన ఈ సంగీత దిగ్గజం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే

4. షారుఖ్ ఖాన్

నాలుగేళ్ల సుదీర్ఘమైన గ్యాప్. అసలు గొప్పగా చెప్పుకునే ఓపెనింగ్స్ వస్తాయా రావానే అనుమానాలు, బాద్షా పనైపోయిందని యాంటీ ఫ్యాన్స్ ప్రచారాలు. వీటిని ఇనుప సుత్తితో బద్దలు కొడుతూ షారుఖ్ ఖాన్ తన పఠాన్ తో ఇండస్ట్రీ రికార్డులను కొత్త సిరాతో రాస్తున్నాడు. ఓ రెండు వందల కోట్లు వస్తే గొప్పనుకుంటే పది రోజులు దాటకుండానే 600 కోట్ల మైలురాయి దాటించేశాడు. ఓవర్సీస్ లోనూ ఇదే ప్రభంజనం కొనసాగిస్తూ చెక్కుచెదరని తన స్టార్ డంని సౌండ్ బాక్స్ పగిలిపోయేలా చాటాడు

5. నరేష్

నట జీవితం కన్నా పర్సనల్ లైఫ్ తో జనాల నోళ్ళలో నానుతున్న సీనియర్ నటుడు నరేష్ పవిత్ర లోకేష్ తో చేసిన లిప్ లాక్ వీడియో మాములు సంచలనం కాదు. మాజీ భార్య నుంచి వస్తున్న ఆరోపణలకు బదులుగా తను చేస్తున్న కౌంటర్లు వెరసి యూట్యూబ్ ఛానల్స్ కి మంచి మెటీరియల్ దొరికేసింది. ఏది చెప్పడానికైనా మొహమాటపడని నరేష్ మనస్తత్వం ఎక్కువ వార్తల్లో ఉండేలా చేస్తోంది. తప్పో ఒప్పో తన గురించి మాట్లాడుకునేలా చేయడంలో ఈయన శైలే వేరు

6. ఎన్టీఆర్

ఆర్ఆర్ఆర్ తర్వాత కొత్త సినిమా ఇంకా మొదలుపెట్టకపోయినా జూనియర్ ఎన్టీఆర్ పలు రకాలుగా వార్తల్లో ఉంటూనే వచ్చాడు. గోల్డెన్ గ్లొబ్ పురస్కారాలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అమెరికా మీడియాతో అక్కడి యాసలో మాట్లాడిన విధానం గురించి కొందరు ట్రోలింగ్ చేసినప్పటికీ చాలా ప్రొఫెషనల్ గా ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఆస్కార్ నామినేషన్ల చోటు ఉండొచ్చని పలువురు అంతర్జాతీయ విశ్లేషకుల అంచనాలు జరగకపోయినా దాన్ని నెగటివ్ ట్రెండింగ్ కి వాడుకున్న వాళ్ళు లేకపోలేదు

7. మైత్రి నవీన్

ఒకే సీజన్ లో అది కూడా కేవలం ఒక్క రోజు గ్యాప్ లో రెండు పెద్ద సినిమాలు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలను రిలీజ్ చేసి తన భాగస్వామి రవి శంకర్ తో కలిసి చాలా కూల్ గా వ్యవహారాలను చక్కబెట్టిన తీరు నవీన్ ని ప్రత్యేకంగా నిలబెట్టింది. అవతల బలమైన అపోజిషన్ దిల్ రాజు థియేటర్ల విషయంలో మరీ దూకుడుగా ఉన్నప్పటికీ ఈయన మాత్రం నిగ్రహం కోల్పోకుండా ఈవెంట్లతో మొదలుపెట్టి కలెక్షన్లు ప్రకటించడం దాకా సమన్వయపరిచిన తీరు పరిశ్రమ వర్గాలతో గొప్పగా పొగిడించుకునేలా చేసింది

8. సమంతా

నెలల తరబడి ప్రమాదకరమైన మాయోసైటిస్ వ్యాధితో బాధపడిన సమంత ఎట్టకేలకు శాకుంతలం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి మీడియా ముందుకు రావడం ఫ్యాన్స్ కి గొప్ప రిలీఫ్ కలిగించింది. అయితే కోలుకున్న తర్వాత విజయ్ దేవరకొండ ఖుషిని పూర్తి చేయడం మీద కాక బాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ కి ప్రాధాన్యం ఇవ్వడం పట్ల ఇప్పటికే రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. యశోద సక్సెస్ తర్వాత తన ఆశలన్నీ శాకుంతలం మీదే ఉన్నాయి. ఇది సోలో హీరోయిన్ గా మొదటి ప్యాన్ ఇండియా మూవీ

9. విజయ్

మీరేమైనా అనుకోండి నా దారి నాదే అంటూ తెలుగు వెర్షన్ ప్రమోషన్ల విషయంలో హీరో విజయ్ మొహం చాటేసినప్పటికీ వారసుడుని తెలుగు జనాలు ఓ మోస్తరుగా ఆదరించారు. కథా కథనాలు మరీ రొటీన్ గా ఉండటంతో పాటు చిరు బాలయ్యని ధీటుగా ఎదురుకునే కంటెంట్ లేకపోవడంతో జస్ట్ హిట్ తో గట్టెక్కాడు. నిర్మాత దిల్ రాజు ఇచ్చిన పార్టీకి హైదరాబాద్ దాకా వచ్చిన విజయ్ కనీసం ఒక వేడుకకో ఇంటర్వ్యూకో సైతం నో చెప్పడం విశేషం

10. నాగ చైతన్య

గత ఏడాది బంగార్రాజుతో హిట్ కొట్టి థాంక్ యు, లాల్ సింగ్ చద్దా రూపంలో రెండు షాకులు తిన్న నాగ చైతన్య సినిమాలకు సంబంధించిన న్యూస్ లో లేడు కానీ బాలయ్య అన్న అక్కినేని కామెంట్లకు స్పందిస్తూ ముందుగా ట్వీట్ చేసిన వైనం ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. మాట తూలకుండా జాగ్రత్తగా మెసేజ్ ఇచ్చిన తీరు, తమ్ముడు అఖిల్ తోనూ స్పందింపజేయడం బాగున్నాయి. నాగార్జున మౌనంగా ఉన్నప్పటికీ మొదట చొరవ తీసుకుంది మాత్రం చైతునే