Miracles in ipl 2018క్రికెట్ లో సంచలనాలు, అద్భుతాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. అయితే జరిగిన అద్భుతం మళ్ళీ మళ్ళీ జరుగుతుండడం బహుశా ఐపీఎల్ లోనే సంభవిస్తుందేమో అనిపించే విధంగా పరిణామాలు ఏర్పడుతుంటాయి. ప్రస్తుత సీజన్ లో జరుగుతోన్న ఐపీఎల్ కూడా ఇందుకు విరుద్ధమేమీ కాదన్న విషయాన్ని ముంబై ఇండియన్స్ గానీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూర్ జట్లు గానీ రానున్న మరో వారం రోజుల్లో నిరూపించబోతున్నాయి.

ఈ సీజన్ ఫస్టాఫ్ ముగిసే సమయానికి ఢిల్లీ, ముంబై, బెంగుళూరు జట్లు ఇంటికి పయనం కావడం దాదాపుగా ఖరారైన అంశం. కానీ ప్రస్తుత పరిస్థితి మాత్రం ఇందుకు విరుద్ధంగా కనపడుతోంది. టాప్ 4లోకి ముంబై గానీ, బెంగుళూరు గానీ సంచలనంగా అడుగుపెట్టే సంకేతాలు కనపడుతున్నాయి. నిజానికి ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో 6, 7 స్థానాలలో ఉన్నప్పటికీ, మిగిలిన రెండు మ్యాచ్ లలోనూ విజయం సాధిస్తే, ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అయినా ఆశ్చర్యం లేదు.

మిగిలిన జట్ల కన్నా తక్కువ పాయింట్లతో ఉన్న ఈ రెండు జట్లు ఎలా వెళ్తాయి? అన్న అనుమానం కలిగితే, దానికే ‘నెట్ రన్ రేట్’ సమాధానం ఇస్తుంది. కోల్ కతా, రాజస్తాన్, పంజాబ్ చేతిలో ఇంకా రెండు మ్యాచ్ లు ఉండగా, కనీసం ఒక్క మ్యాచ్ లో విజయం సాధించినా, 14 పాయింట్లతో ముగుస్తాయి. అయితే నెట్ రన్ రేట్ లో మాత్రం ముంబై, బెంగుళూరుల కంటే వెనుకబడి ఉంటాయి. ఎందుకంటే ఆ మూడు జట్ల నెట్ రన్ రేట్ లు ఇప్పటికీ ‘మైనస్’లలోనే ఉన్నాయి.

ముంబై, బెంగుళూరు జట్లు రెండూ ప్లే ఆఫ్స్ కు చేరినా ఆశ్చర్యం లేదు లేదంటే ఆ రెండింటిలో ఒక్క జట్టు చేరినా ఆశ్చర్యపోనవసరం లేదు. విచిత్రం ఏమిటంటే… ఫస్టాఫ్ లో ఒక్క విజయం సాధించడానికి ఆపసోపాలు పడ్డ ఈ రెండు జట్లు, సెకండాఫ్ లో మాత్రం ప్రత్యర్ధులకు అవకాశం ఇవ్వకుండా విజయం సాధించడం! ఇంకో ట్రాక్ ఏమిటంటే… గతంలో ఈ రెండు జట్లకు ఇదే రకమైన ట్రాక్ రికార్డు కలిగి ఉండడం మరో విశేషం! ఫైనల్ గా ఐపీఎల్ లో అన్నీ అలా జరిగిపోతాయని అనుకోవడమే మిగిలి ఉంది!