Minister Taneti Vanitha about gorantla madhav issueఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత పేరులోనే వనిత ఉంది. కనుక మహిళలకు అన్యాయం జరిగితే ఆమె చాలా చురుకుగా చర్యలు తీసుకొంటారని ఆశించడం అత్యాశ కాదు. కానీ ఆమె కూడా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యవహారంపై వైసీపీ వైఖరితోనే మాట్లాడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

“గోరంట్ల మాధవ్‌ వీడియోను ఫోరెన్సిక్ పరీక్షకు పంపాము. ఆ నివేదికలో అది అసలైనదే అని తేలితే ఆయనపై తప్పకుండా చర్యలు తీసుకొంటాము. ఒకవేళ అది నకిలీదని తేలితే మా ప్రభుత్వంపై బురద జల్లెందుకు ఈ వీడియోను సృష్టించిన వారిపై కటిన చర్యలు తీసుకొంటాము. తప్పు ఎవరు చేసినా తప్పే. ఈ విషయంలో మన, తన అనే భేదం చూపబోము.

ఈ వీడియో వ్యవహారంలో ఇంతవరకు బాధిత మహిళా ఫిర్యాదు చేయలేదు. కానీ టిడిపి మాత్రం తమ మహిళా నేతలను అడ్డుపెట్టుకొని నీచరాజకీయాలు చేస్తోంది. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరిగిపోతున్నాయంటూ టిడిపి మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత విజయవాడలో పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని రౌండ్ టేబిల్ సమావేశం నిర్వహించి డ్రామా చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది. గోరంట్ల మాధవ్‌ వ్యవహారంలో ఆమె మాట్లాడుతున్న భాష చాలా జుగుప్సాకరంగా మహిళలు తలదించుకొనేలా ఉంది,” అని హోంమంత్రి తానేటి వనిత విమర్శించారు.

అసలు ఈ గోరంట్ల మాధవ్‌ షో బయటపడినప్పుడే సిఎం జగన్మోహన్ రెడ్డి ఆయనను పిలిపించుకొని సంజాయిషీ అడిగి ఉండాలి కానీ అడగలేదు. ఈ వ్యవహారం బయటపడి అప్పుడే వారం రోజులవుతున్నా ఇంతవరకు ఫోరెన్సిక్ నివేదిక రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. “గోరంట్ల మాధవ్‌ ఎవరినీ రేప్ చేయలేదు కనుక ఇదేమీ పెద్ద కేసు కాదని..” సజ్జల రామకృష్ణారెడ్డి ఆయనకు క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చేశారు. ఇప్పుడు హోంమంత్రి తానేటి వనిత కూడా ఇదంతా తమ ప్రభుత్వంపై బురద జల్లెందుకు టిడిపి చేస్తున్న కుట్ర అన్నట్లు మాట్లాడటం గమనిస్తే జగన్ ప్రభుత్వం ఈ కేసును మెల్లగా అటకెక్కించేసే ఆలోచనలో ఉన్నట్లు అర్దమవుతోంది.