minister roja at etv dasara eventఆర్‌కె.రోజా మంత్రి కాకమునుపు జబర్దస్త్ రియాల్టీషోలో పాల్గొనేవారు మంత్రి అయ్యాక దానికి దూరంగా ఉండాల్సివస్తోంది. అయితే నిన్న దసరా పండుగ సందర్భంగా జబర్దస్త్ సభ్యులందరూ ఆమెను స్టూడియోకి ఆహ్వానించి పూలదండవేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జబర్దస్త్ టీమ్‌లోని నూకరాజు రోజాకు ఓ పాత వీడియో చూపించి ఆమెను ఓ ప్రశ్న అడిగాడు. దాంతో ఆమె “ఏంటి నన్ను అవమానించేందుకే ఇక్కడికి పిలిచారా?” అంటూ మెడలో పూలదండని తీసి విసిరేసి అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంతకీ అతను ఏమడిగాడంటే, “మేడమ్ మీకు జబర్దస్త్ అంటే చాలా ఇష్టం… దీని వలననే నాకు మంచి పేరు వచ్చిందని చెపుతారు కదా? మరి మంత్రి పదవి లభించగానే జబర్దస్త్ ఎందుకు వదిలేశారు?” అని అడిగాడు.

అప్పుడు రోజా అతనిపై ఆగ్రహంతో, “ఏంటీ బుర్ర ఉండే మాట్లాడుతున్నావా నువ్వు? నాకు జబర్దస్త్ ప్రోగ్రామ్ అన్నా, దానిలో పాల్గొనే మీరందరూ అన్నా నాకు చాలా ఇష్టమని చాలాసార్లు చెప్పాను. నేను 150కి పైగా సినిమాలు చేశాను కానీ నాకు జబర్దస్త్ షోతోనే మంచిపేరు వచ్చింది. నేను ఎక్కడికి వెళ్ళినా చిన్న పిల్లలు సైతం నన్ను గుర్తుపట్టి మాట్లాడుతున్నారు. అందుకే నాకు జబర్దస్త్ అంటే చాలా ఇష్టం. మిమ్మల్ని మిస్ అవుతున్నాననే పండగ రోజున సరదాగా కలుద్దామని మీరందరూ పిలిస్తే మీ మీద అభిమానంతోనే నేను వచ్చాను. కానీ మీరందరూ నన్ను పనిగట్టుకొని ఈవిదంగా అవమానించడానికే పిలిచినట్లున్నారు…” అంటూ రోజా కన్నీళ్ళు పెట్టుకొన్నారు.

అప్పుడు హైపర్ ఆది కలుగజేసుకొని “వాడూ అదే అడుగుతున్నాడు మేడమ్… మీ సక్సస్‌లో జబర్దస్త్ ఉంది కానీ జబర్దస్త్ లో మీరు లేరేమిటని అడుగుతున్నాడు మేడమ్,” అని సర్దిచెప్పబోయాడు. దాంతో ఆర్‌కె. రోజా ఇంకా ఆగ్రహంగా “మీరు నన్ను ఈవిదంగా అవమానించడానికే పనిగట్టుకొని పిలిచినట్లున్నారు…” అంటూ బయటకు వెళ్ళిపోతుంటే, “సారీ మేడమ్… మేము కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నామనే ఉద్దేశ్యంతోనే అడిగాము తప్ప వేరే ఉద్దేశ్యంతో కాదు మేడమ్…” అంటూ ఆమెను బ్రతిమాలుకొన్నారు.

అప్పుడు ఆర్‌కె. రోజా శాంతించి, “అలా అడగరు ఎవరైనా… ఆల్రెడీ నేను చాలా మిస్ అవుతున్నాననే ధైర్యం చేసి ఇవాళ్ళ ఇక్కడికి వచ్చాను కదా?” అంటూ కన్నీళ్ళు పెట్టుకొన్నారు. “నేను మినిస్టర్ అవడం మీకు ఇష్టం లేదా?నేను మినిస్టర్ అవ్వాలని మీరు ఫ్రే చేయలేదా?” అంటూ ఉద్వేగంగా ప్రశ్నించారు.

హైపర్ ఆది స్పందిస్తూ, “మీరు మినిస్టర్ అవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. కానీ మిమ్మల్ని మిస్ అవడం దురదృష్టంగా భావిస్తున్నాము,” అని సర్దిచెప్పాడు.

అప్పుడు ఆమె స్పందిస్తూ “నేను ఎప్పుడూ చెపుతూనే ఉన్నాను. మీకు నన్ను ఎప్పుడైనా చూడాలనుకొంటే నా ఇంటికి రండి లేదా ఎప్పుడైనా పండగలు పబ్బాలకి ఇలా కలుసుకొందాము. అంతేగానీ ఎవరో చెప్పిన మాటలను పట్టుకొని నన్ను ఇలా అవమానించొద్దు,” అని సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు.

దాంతో అందరూ నూకరాజు, హైపర్ ఆదీతో సహా అందరూ “సారీ మేడమ్ ఇంకెప్పుడూ ఇలా అడగము,” అని చెప్పగానే అంతవరకు కన్నీళ్ళు పెట్టుకొన్న రోజమ్మ మళ్ళీ మామూలుగా మారిపోయి చిర్నవ్వులు చిందిస్తూ అందరితో ఆప్యాయంగా మాట్లాడారు.

కేవలం పది నిమిషాల వ్యవధిలో ఆగ్రహం, ఆవేశం, ఆవేదన, కన్నీళ్ళు, ఆప్యాయత, చిర్నవ్వులతో నవరసాలను ప్రదర్శించిన గొప్ప నటి ఆర్‌కె. రోజా మన మంత్రిగారు అవడం మన అదృష్టమే కదా?