తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈరోజు ఏపీ పరిస్థితి దయనీయంగా ఉందంటూ చేసిన వ్యాఖ్యలపై ఓ పక్క వైసీపీ మంత్రులు మంత్రులు, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు ఖండిస్తుంటే, మంత్రి ఆర్కె. రోజా హైదరాబాద్ వెళ్ళి తెలంగాణ సిఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకోవడం విశేషం. ఆ తరువాత బయట మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్నప్పుడు కూడా, ఏదో ఘనకార్యం చేసినట్లు ముసిముసినవ్వులు నవ్వుతూ మాట్లాడటం విశేషం.
“మీ ఆంధ్రా గురించి మంత్రి కేటీఆర్ ఇలా అన్నారు కదా?” అని అడిగినప్పుడైనా ఆమె మొహంలో కించిత్ బాధ కనిపించకపోగా మూసిముసి నవ్వులు నవ్వుతూ, “కేటీఆర్ మాట్లాడింది నేనూ వాట్సాప్‌లో విన్నాను. ఆయన మా రాష్ట్రం గురించి అనలేదు. పొరుగు రాష్ట్రంలో అని అన్నారు. కావాలంటే ఆ వీడియో మీరు చూడండి. ఒకవేళ ఆయన మా ఆంధ్రప్రదేశ్ గురించే అని ఉంటే దానీ నేను ఖండిస్తున్నాను. ఆయన స్నేహితుడు ఎవరో తెలీదు కానీ అతనిని వెంటబెట్టుకు వస్తే పర్యాటక మంత్రిగా నేను స్వయంగా వారికి దగ్గరుండి ఆంధ్రప్రదేశ్ అంతా తిప్పి చూపిస్తాను,” అని మళ్ళీ ముసిముసి నవ్వులు నవ్వుతూ సమాధానం చెప్పారు.
కేటీఆర్ మా రాష్ట్రం గురించి అనలేదని చెపుతూనే, మళ్ళీ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి గురించి వివరణ ఇచ్చుకోవడం, కేటీఆర్ స్నేహితుడు ప్రస్తావన చేసి మా రోడ్లు చూసేందుకు రమ్మనమని ఆహ్వానించడం గమనిస్తే, ‘కేటీఆర్ ఏపీని ఉద్దేశ్యించే అన్నారని మాకు తెలుసు కానీ తెలియనట్లు నటిస్తున్నామన్నట్లుంది’ ఆమె వ్యవహారం.
ఆమె తన ముసిముసినవ్వులు కొనసాగిస్తూ, “యావత్ దేశానికే మా సిఎం జగన్మోహన్ రెడ్డి రోల్ మోడల్‌గా నిలుస్తున్నారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు రోడ్లు కొట్టుకుపోతే వాటన్నిటినీ ఎప్పటికప్పుడు మళ్ళీ వేయిస్తున్నారు. అవినీతి రహితంగా అనేక సంక్షేమ పధకాలు నడిపిస్తున్నారు. మా సచివాలయ వ్యవస్థను చూసి తమిళనాడు ప్రభుత్వం మెచ్చుకొంటోంది. కేటీఆర్ మా రాష్ట్రానికి వస్తే అవి చూపిస్తా. తెలంగాణ రాష్ట్రంలో కూడా సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవచ్చు,” అంటూ చాలానే మాట్లాడారు మంత్రి రోజా. అయితే వాటి గురించి చెపుతూ ఆమె నవ్వుతుండటం గమనిస్తే తాను చెపుతున్నవాటి గురించి తనకే నమ్మకం లేదన్నట్లు అనిపిస్తుంది.
ఓ పక్క తెలంగాణ సిఎం కేసీఆర్ మొదలుకొని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వరకు ఆంధ్రప్రదేశ్ గురించి తరచూ చులకనభావం వ్యక్తం చేస్తుంటే, అదీ…మంత్రి కేటీఆర్ ఏపీ గురించి చులకనగా మాట్లాడిన కొన్ని గంటలకే మంత్రి రోజా ఏ మాత్రం ఆత్మాభిమానం లేనట్లు సిఎం కేసీఆర్ ఆశీర్వాదం కోసం వార్ల్ల ఇంటికే వెళ్ళడం విస్మయం కలిగిస్తుంది. తెలంగాణ మంత్రులు ఎద్దేవా చేస్తున్నది ఆంధ్రా ప్రజలను కాదు..తమ జగనన్న ప్రభుత్వాన్ని.. తమ ప్రభుత్వ పరిపాలననే అనే విషయం మంత్రి రోజా గ్రహించారో లేదో తెలియదు గానీ ముసిముసి నవ్వులు నవ్వుతూ నేను పర్యాటక మంత్రిని అయ్యననే విషయం ఒకటికి రెండుసార్లు నొక్కి చెప్పడం మరో విశేషం.
Dallas Kamma Folks Behind Acharya Sales?
Managing Two Heroines, This Manager Becomes A Sucker!