Minister Dharmana Prasada Rao Press meet in Vizagవిశాఖ రాజధాని కోసం తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ కొత్త డ్రామా మొదలుపెట్టిన మంత్రి ధర్మాన ప్రసాదరావు, ముఖ్యమంత్రికి తన రాజీనామా లేఖను సమర్పించి ఇచ్చి దానిని ఆమోదింపజేసుకొనే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. కానీ తనకు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కంటే మంత్రి పదవి ముఖ్యం కాదంటూ ఉపన్యాసాలు దంచుతున్నారు.

ఆదివారం విశాఖలో జరిగిన విశాఖ రాజధాని సాధన ఐక్యవేదిక సమావేశంలో పాల్గొన్న మంత్రి ధర్మాన, “రాష్ట్రాభివృద్ధి కంటే నాకు ఈ పదవులు ముఖ్యం కాదు. నాకు ఈ మంత్రి పదవిలో ఉండటం కంటే ప్రజల మనసులలో చిరస్థాయిగా నిలిచిపోవాలనే కోరుకొంటున్నాను. విశాఖ రాజధాని కోసం నేను మంత్రి పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్దంగా ఉన్నాను కానీ విశాఖను రాజధానిగా చేయమని ఉత్తరాంద్ర ప్రజలు ఒక్కరూ గట్టిగా నోరువిప్పి మాట్లాడరేమిటి?

విశాఖని రాజధాని చేయాలని నోరు విప్పి అడగడానికి ప్రజలకు ఎందుకు అంత ఆలోచిస్తున్నారో నాకు అర్దం కావడం లేదు. మన ప్రాంతానికి దక్కిన ఈ హక్కుని మరొక ప్రాంతం వారు అడ్డుకోవాలని చూస్తుంటే వారిని గట్టిగా నిలదీసి మన హక్కులను మనం సాధించుకోవాలి. ఉత్తరాంద్ర జిల్లాలలో ఈ రాజధాని ఉద్యమం ముందుండి నడిపించానికి నా ఒక్కడిదే బాధ్యత అన్నట్లు అందరూ వ్యవహరిస్తున్నారు. రేపోమాపో నేను రాజకీయాల నుంచి తప్పుకొంటాను. కనుక ఈ అంశంపై యువతే చొరవ తీసుకొని పోరాడాల్సి ఉంటుంది,” అని అన్నారు.

విశాఖ ఉక్కు కోసం, రైల్వే జోన్ కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఉత్తరాంద్ర, ముఖ్యంగా విశాఖ జిల్లా ప్రజలు విశాఖ రాజధాని కావాలని ఎందుకు అడగడం లేదు? ఎందుకు ఉద్యమించడం లేదు?అనే మంత్రి ధర్మాన ప్రశ్నలోనే సమాధానం కూడా ఉంది. ఇటీవల ఆయన శ్రీకాకుళంలో జరిగిన సభలో కూడా ఇదే ప్రశ్న అడిగినప్పుడు అక్కడి ప్రజలు ఎవరూ కూడా స్పందించలేదు. అంటే మూడు రాజధానులు, విశాఖలో రాజధాని ఏర్పాటు వారికి సమ్మతం కాదని, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఉత్తరాంద్ర జిల్లాల ప్రజలు కోరుకొంటున్నారని అర్దం అవుతోంది.

కానీ వైసీపీ, ఆ పార్టీ నేతల రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకొన్న ఈ మూడు రాజధానుల నిర్ణయాన్ని, అభిప్రాయాలను ప్రజలపై బలవంతంగా రుద్ధి తమకు మద్దతు తెలపాలని లేకుంటే ఆంధ్రా ద్రోహులు, ఉత్తరాంద్ర ద్రోహులు, విశాఖ ద్రోహులు, వారిని జిల్లా నుంచి తరిమికొట్టాలని వైసీపీ నేతలు పిలుపునీయడం చాలా దారుణం. ప్రజల ఆకాంక్షలు, ప్రాజాభిప్రాయాన్ని పట్టించుకోకుండా తమ అభిప్రాయాలను ప్రజలపై బలవంతంగా రుద్దాలని వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నందునే వారికి ప్రజల మద్దతు లభించడం లేదు. ఈ విషయం వారికి తెలియదనుకోలేము. కానీ రాష్ట్ర శ్రేయస్సు, ప్రజాభిప్రాయం కంటే తమ అధినేత సిఎం జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికే వైసీపీ నేతలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు గనుక మూడు రాజధానులకు వంతపాడుతున్నారు.

ఓ పక్క పదవులు, వారసులకు టికెట్ల కోసం ఆరాటపడుతూ మళ్ళీ తమకు పదవులు అంతా ముఖ్యం కాదని, ప్రజలే ముఖ్యమని మంత్రి ధర్మాన వంటివారు చెప్పడాన్ని అమానుకోవాలి?తమకు ఓట్లేసి గెలిపించాల్సిన ప్రజల కంటే తమ అధినేత ముఖ్యమనుకొంటే రేపు ప్రజలు వారికి ఎందుకు ఓట్లు వేయాలి?