Minister Botsa Satyanarayana Teacher MLC Electionsమరో రెండు నెలల్లో విశాఖపట్నం రాజధానిగా పరిపాలన మొదలవుతుందని మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి చెప్పారు. తాజాగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా అధికారులతో అదే మాట అన్నట్లు తెలుస్తోంది. విజయవాడలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశమైనప్పుడు, వారు విజయవాడ శివారులో ఇబ్రహీంపట్నం వద్ద విద్యాశాఖ కమీషనరేట్‌ ఉండటంతో చాలా ఇబ్బందిగా ఉందని దానిని నగరంలోకి మార్చుకొందామని సూచించారు. కానీ మంత్రి బొత్స సత్యనారాయణ వారు ఊహించని సమాధానం ఇచ్చిన్నట్లు తెలుస్తోంది. “ఎలాగూ ఈ ఏప్రిల్ నాటికి విశాఖకి తరలిపోతున్నాము కనుక ఇప్పుడు కమీషనరేట్ మార్చనవసరం లేదు,” అని అన్నట్లు సమాచారం.

అంటే వైసీపీ ప్రభుత్వం విశాఖని రాజధానిగా చేసేందుకు సిద్దం అవుతున్నట్లు స్పష్టమవుతోంది. విశాఖలో ఋషికొండపై కట్టడాల నిర్మాణపనులు కూడా రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసిన్నట్లు తెలుస్తోంది. వాటిని పర్యాటక కేంద్రాలుగా వినియోగించుకొంటామని న్యాయస్థానాలకి చెపుతున్నప్పటికీ ముఖ్యమంత్రి కార్యాలయం కోసమే వాటిని నిర్మిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అయితే సుప్రీంకోర్టు,హైకోర్టులో రాజధానిపై కేసులు పెండింగులో ఉండగా విశాఖకి రాజధాని ఏవిదంగా తరలించగలమని వైసీపీ ప్రభుత్వం భావిస్తోందో తెలియదు. మార్చి 3,4 తేదీలలో విశాఖపట్నంలో జరుగబోయే గ్లోబల్ సదస్సులో చెప్పుకొనేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈవిదంగా హడావుడి చేస్తోందా లేక నిజంగానే విశాఖకి రాజధాని తరలించేందుకు సిద్దం అవుతోందా?అనే ప్రశ్నకి త్వరలోనే సమాధానం లభించవచ్చు.

సుప్రీంకోర్టులో కేసుల నేపధ్యంలో విశాఖకి రాజధానిని తరలించడం అసంభవమే కానీ ఒకవేళ తరలిస్తే వచ్చే ఎన్నికలలో టిడిపి గెలిచి అధికారంలోకి వస్తే అది మళ్ళీ విశాఖ నుంచి అమరావతికి తరలించడం ఖాయం. మొదట హైదరాబాద్‌ నుంచి అమరావతికి, ఇప్పుడు అమరావతి నుంచి విశాఖపట్నానికి, భవిష్యత్‌లో మళ్ళీ విశాఖపట్నం నుంచి అమరావతికి ఇలా రాజధానిని మార్చుకొంటూపోతే ఇక రాష్ట్రం వైపు పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు తొంగి చూడరు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మరింత అప్రదిష్ట మూటగట్టుకోవడం ఖాయం.