Minister anil kumar yadav  polavaram project review meetingరాజకీయ నాయకులు మైకు దొరికితే ఏం మాట్లాడుతారో తెలీకుండా మాట్లాడతారు. మొన్న ఆ మధ్య ఏపీ జలవనరుల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలుగుదేశం హయాంలో పోలవరం ప్రాజెక్ట్ 70% పనులు అవ్వలేదని… ఒకవేళ అయ్యాయని నిరూపిస్తే తాను మీసం తీయించుకుంటా అని మీడియా ముఖంగా సవాలు విసిరారు.

రెండు రోజుల క్రితం ప్రాజెక్టు గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో జరిగిన రివ్యూ మీటింగ్ లో అధికారులు ప్రాజెక్టు పనులు దాదాపుగా 70% పూర్తి అయ్యాయని చెప్పుకొచ్చారు. ప్రాజెక్ట్ లోని వివిధ విభాగాలలో ఏ మేరకు పనులు జరిగాయో పూసగుచ్చినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

ఆ సమావేశంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయన విసిరిన సవాలు మాటేమిటి అని తెలుగుదేశం పార్టీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మంత్రి మీసం తీసి తిరుగుతారా? అని ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా ప్రాజెక్టు పనులు అటుఇటుగా 70% అయ్యాయని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ప్రకటించింది. అయినా రాజకీయ విమర్శలు మానలేదు.

మరోవైపు… పోలవరం ఫండింగ్ విషయంలో కేంద్రం పెట్టిన తకరారు గుబులు పుట్టిస్తుంది. 47,575 కోట్ల వ్యయం అయ్యే ప్రాజెక్టు కు కేవలం 20,398 కోట్లు ఇస్తామంటుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఒకవేళ అదే ఫైనల్ అయితే అప్పు దొరకక్కపోతే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ వ్యయం పెట్టే సీన్ అయితే లేదు. దీనితో పోలవరం ప్రాజెక్ట్ భవిష్యత్తు పై నీలినీడలు అలముకున్నాయి.