mini theatre in Vijayawada bus standతాత్కాలిక రాజధానిగా ‘అమరావతి’కి అతి చేరువలో ఉన్న విజయవాడ నగరం రూపురేఖలు ఇప్పుడిప్పుడే మారుతున్నాయి. ఓ పక్కన నగర సుందరీకరణ పనులు వేగంగా జరుగుతుండగా, మరో పక్కన నగరాన్ని టూరిజం హబ్ గా మార్చే ప్రక్రియ కూడా జరుగుతోంది. కాల్వల పక్కన పచ్చదనం, హైవేల పక్కన వాకింగ్ ట్రాక్ వంటి అంశాలు నగరానికి కొత్త శోభను తీసుకువస్తున్న తరుణంలో విజయవాడకు మరో అంశం హైలైట్ కాబోతోంది.

విజయవాడ అని చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది సినిమా ధియేటర్లే. ఇటీవల నిర్మాణం అయిన పలు మల్టీప్లెక్స్ లకు తోడు గతంలో ఉన్న సినిమా ధియేటర్లే ‘ఎంటర్టైన్మెంట్’కు నిలయం. వీటన్నింటికి తోడుగా ఇప్పుడు నగరంలో ఓ మినీ ధియేటర్ కొలువు తీరనుంది. నిత్యం రద్దీగా ఉండే విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ లో 130 మంది వీక్షించేలా ఓ ధియేటర్ ను నిర్మించారు.

ప్రయాణికుల సౌకర్యార్ధం నిర్మించిన ఈ ధియేటర్ ప్రజల ఆదరణ పొందితే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన బస్టాండ్లలో ఇలాంటి ‘మినీ ధియేటర్’లను ఏపీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేయనుంది. శాటిలైట్ సాంకేతిక పరిజ్ఞానం గల ఈ ధియేటర్లో పరిమిత సంఖ్యలో సీట్లు ఉండడంతో ప్రజల ఆదరణ చూరగొంటుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.