Million Dollar For Ram Charan –Brief Historyమెగా వారసుడు రామ్ చరణ్ ఎదురుచూసిన నిరీక్షణ ఫలించింది. ఓ పక్కన తన తోటి హీరోలంతా యుఎస్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సాధిస్తుంటే… తన సినిమాలు మాత్రం చతికిలపడుతుండడం తీవ్ర మనోవేదనను మిగిల్చింది. దీంతో “ధృవ” సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చెర్రీ, ఎలాగైనా మిలియన్ డాలర్స్ ను సొంతం చేసుకోవాలని టార్గెట్ ఫిక్స్ చేసుకుని యుఎస్ వెళ్లి మరీ ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టి, ఆ ఘనతను సొంతం చేసుకున్నాడు.

దీంతో చెర్రీతో పాటు మెగా అభిమానులు కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అలాగే అనుకున్న లక్ష్యం పూర్తి కావడంతో చెర్రీ కూడా హైదరాబాద్ చేరుకున్నాడు. అయితే రామ్ చరణ్ ఈ మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరడం ఇప్పటికే లేట్ అయ్యిందని అందరూ భావిస్తుంటే… తాజాగా సరికొత్త వాదన తెరపైకి వచ్చింది. అందరి హీరోలలోకల్లా తక్కువ సినిమాలతోనే చెర్రీ ఈ రికార్డును సొంతం చేసుకున్నారంట.

యుఎస్ బాక్సాఫీస్ ను కొల్లగొట్టిన తొలి టాలీవుడ్ హీరోగా ప్రిన్స్ మహేష్ బాబు నిలువగా, ఆ తర్వాత పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాగార్జున, నాని, ప్రభాస్ లు దశల వారీగా 1 మిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరారు. అయితే వీరందరి కంటే త్వరగా… అంటే కేవలం 10వ సినిమాతోనే ‘మెగా పవర్ స్టార్’ ఈ 1 మిలియన్ డాలర్స్ క్లబ్ లోకి చేరిపోయాడంటూ వీరాభిమానులు పండగ చేసుకుంటున్నారు.

మరి ఈ విషయం చెర్రీ చెవిన పడితే… కాస్త స్థిమిత పడేవారేమో కదా..! అంటే ఈ లెక్కన మెగాస్టార్ చిరంజీవి 149 సినిమాలు చేసినా అందుకోలేని రికార్డును, చిరు తనయుడు కేవలం 10వ సినిమాతో సొంతం చేసుకున్నారన్న మాట! ఎంతైనా ‘అభిమానం’ చూపించడంలో ‘మెగా ఫ్యాన్స్’ తీరే వేరంటున్నారు సినీ జనాలు. ‘డాలర్స్ డ్రీం’ నెరవేరడంతో మెగా అభిమానుల సంతోషం అలా ఉంది మరి!