middle class people problems in andhra pradeshమధ్యతరగతి ప్రజానీకంపై జగన్ సర్కార్ కు ఎంత చిన్న చూపో అన్న విషయాన్ని ఓ ప్రముఖ టీవీ ఛానల్ డిబేట్ లో వైసీపీ ప్రతినిధిగా వచ్చిన సుందర్రాజా శర్మ యావత్ రాష్ట్రానికి కళ్ళ ముందు ఉన్న పొరలు వీడిపోయేలా వివరించారు. ఇక ఈ విషయాలు ఆలకించిన మధ్య తరగతి ప్రజలలో, ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో రానున్న ఎన్నికల ఫలితాలతోనే తేలాలి.

అసలు విషయాన్ని వస్తే., పన్నుల భారాలే తప్ప ప్రభుత్వ పథకాలకు నోచుకోని మధ్యతరగతి ప్రజలపై వైసీపీ ప్రభుత్వం రోజుకో భారాన్ని వడ్డిస్తూ వారి నడ్డి విరుస్తోందని రిపోర్టర్ ప్రభుత్వ అధికార ప్రతినిధిని ప్రశ్న అడగగా, దానికి ఆయనిచ్చిన సమాధానంతో ప్యానల్ సభ్యులతో పాటు చూస్తున్న ప్రజానీకం కూడా నోరెళ్లబెట్టే పరిస్థితి నెలకొంది.

ప్రభుత్వ ఉద్దేశం.., “మధ్య తరగతి ప్రజలను పేదవారిగా మార్చి, వారికి పథకాలను అందచేయడమే” అంటూ అందరూ విస్తుపోయే కఠిన సత్యాన్ని చెప్పారు. మధ్య తరగతి జీవితాలు అటు ప్రభుత్వ పథకాలకు – ఇటు ప్రభుత్వ పన్నులకు మధ్య నలిగిపోతున్నాయి. ప్రభుత్వ పథకాలకు వీరు అర్హులు కాలేరు., కేవలం పన్నుల చెల్లింపులకు మాత్రమే వీరు అర్హులుగా మిగులుతారు.

ప్రభుత్వాలు ఉచిత పధకాల పేరుతో పేదలకు అందించే రాయితీలు, వసతులు, ఆర్ధిక సహాయాలు అన్నీ మధ్య తరగతి ప్రజల చెమట నుంచి వచ్చిన ఆదాయమే. “సొమ్మొకరిది – సోకొకరిది” అన్న చందంగా ప్రభుత్వాలు వ్యవహరించడం అత్యంత దారుణం. రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు ఉపయోగకరంగా వైసీపీ సర్కార్ పధకాలను రూపొందిస్తోందా? లేక పధకాలు అమలు చేయడానికి ప్రజలను పేదలుగా మారుస్తుందో? చెప్పాలంటూ చర్చలో ఇతర పార్టీ నేతల సభ్యులు పట్టుపట్టారు.

ఇంత నిస్సిగ్గుగా వైసీపీ నాయకులు మధ్య తరగతి ప్రజలను అవహేళన చేయడం ప్రభుత్వానికి తగదు అంటున్నాయి ప్రతిపక్ష పార్టీలు. ఓట్లు అడిగేటప్పుడు పేదవారి జీవితాన్ని ఉద్ధరిస్తామని చెప్పి, ఇంటింటికి తిరిగిన మీరు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇలా ఒక్కొక్కరిని పేదల జాబితాలో చేరుస్తామని చెప్పడం వైసీపీ నాయకుల అహంకారానికి నిదర్శనం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని బేరీజు వేసుకుని సంక్షేమ కార్యక్రమాలు చేపడితే ఎవ్వరికి ఎటువంటి భారం ఉండదు. అలా కాకుండా ప్రభుత్వాలు అప్పులు చేసి పధకాలు అమలు చేయాలి చూస్తే మాత్రం, మధ్య తరగతి ‘గతి’ తప్పడం తప్ప మరో ఆలోచనే ఉండదు. వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో నవరత్నాలు అని ప్రవేశపెట్టిన వాటిలో ఏ ఒక్క ‘రత్నం’ కూడా ఈ వర్గ ప్రజలకు చేరదు.

నవరరత్నాల అమలుకు ప్రజలపై ఇప్పటికే జగన్ ప్రభుత్వం చెత్త పన్ను, మరుగుదొడ్డి పన్ను, ఆస్తి పన్ను పెంపు, కరెంట్ చార్జీల బాదుడు, పోల్ టాక్స్, పెట్రోల్ పై పన్ను, మద్యం పన్ను, చలానాలు, ఫైన్ల రూపంలో “నవ పన్నులు” భారం వేశారు. ఆ భారాన్ని మోసే వారిలో ఎక్కువ శాతం ఈ మధ్యతరగతి ప్రజలే అంటూ ప్రభుత్వ పెద్దలకు వాస్తవాలను తెలియచేసారు.

ఓట్లు మాత్రం రాష్ట్ర ప్రజలందరూ వేయాలి, పధకాలు మాత్రం కొందరికైనా? అని ప్రజలు ప్రభుత్వాలను ప్రశ్నించే రోజు రాకపోదు. పేద వారికి ప్రభుత్వాల తోడ్పాటు ఉంటుంది., ఉన్నత వర్గానికి ప్రభుత్వ సహకారం ఉంటుంది. ఎటు తిరిగి “రెంటికి చెడ్డ రేవడిలా” మిగిలేది మధ్య తరగతే అనేది ప్రభుత్వాలు తెలుసుకునే రోజు రావాలని కోరుకుంటున్నారు ఈ వర్గం ప్రజలు.

వైసీపీ ప్రభుత్వం ఉచిత పధకాల పేరుతో కుడి చేతితో ఇస్తూ., పన్నుల రూపంలో ఎడమ చేతితో లాక్కుంటోందని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఈ ఉచిత పథకాలకు అడ్డుకట్ట వేయకపోతే మన రాష్ట్ర భవిష్యత్తు శ్రీలంక రూపంలో కళ్ళముందే కనపడుతుందని టీడీపీ నేత లోకేష్ చెప్పిన ఉదంతాన్ని ఎంతో మంది ఆర్ధిక వేత్తలు బలపరుస్తున్నారు.

ప్రభుత్వాలు ఎప్పుడైతే మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని పాలన కొనసాగిస్తుందో అప్పుడే రాష్ట్రానికి ఈ అప్పుల భారం తగ్గుతుంది. పేదలకు పధకాలు పంచుతున్నాం కదా పన్నులు కట్టడానికి మీకేం బాధ అంటూ వైసీపీ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖలు దేనికి సంకేతం? పన్నుల భారం కట్టలేక., పెరిగిన ధరలు భరించలేక., మెరుగైన వైద్య సదుపాయాలు అందక., చదివించలేక – చదువు మాన్పించలేక., ఒక్క మాటలో చెప్పాలంటే… “అటు చావలేక ఇటు బ్రతక లేక” బండి ఈడుస్తున్న ప్రజలకు మీరిచ్చే సందేశం ఇదేనా..! అంటూ ప్రజలు నిలదీస్తున్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ నవరత్నాల వలన ఆసరా పొందిన కుటుంబాల కంటే, ఆసరా కోల్పోయిన వారి శాతమే ఎక్కువ అని ఆర్థికవేత్తల అంచనా. ఇటువంటి పధకాల వలన ‘తిరోగమనమే’ తప్ప ‘ఎదుగుదల’ ఎరుగని వర్గంగా ఈ ‘మధ్యతరగతి’ ప్రజలు ఉంటారనడంలో ఎటువంటి సందేహం లేదు. అభివృద్ధితో కూడిన సంక్షేమాన్ని ప్రజలు కోరుకుంటారు కాని, ఆర్ధిక విధ్వంసంతో కూడిన సంక్షేమాన్ని కాదు అంటున్నారు సామాజిక, ఆర్ధిక నిపుణులు.