Mickey J Meyer Says Happy Days, Shatamanam Bhavati Flopఏ సినిమా హిట్ అవుతుంది, ఏ సినిమా ఫ్లాప్ అవుతుందని సరిగ్గా జడ్జ్ చేయడం ఎవరి తరం కాదు. అయితే అందరి కంటే ముందుగా సినిమాను చూసే అవకాశం ఎడిటర్ మరియు సంగీత దర్శకుడికి దక్కుతుంది. సినిమా మొత్తానికి రీ రికార్డింగ్ ఇవ్వాల్సి ఉండడంతో, మ్యూజిక్ డైరెక్టర్ ఎంతో కొంత అంచనా వేయవచ్చు, అలాగే ఎడిటర్ కూడా అనవసరపు సన్నివేశాలను తీసేయాల్సి ఉండడంతో, సినిమా ఫేట్ ను చెప్పేయొచ్చు. అందులో భాగంగానే సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ కొన్ని సినిమాలలో పప్పులో కాలేసినట్లు ఒప్పుకున్నారు.

‘హ్యాపీ డేస్’ సినిమాకు రీ రికార్డింగ్ అందించిన తర్వాత ఈ సినిమా అసలేమీ అర్ధం కాలేదని, ప్రేక్షకులకు కూడా నచ్చదని భావించి, ఇది ఫ్లాప్ అవుతుందని దర్శకనిర్మాత శేఖర్ కమ్ములకు ముందే చెప్పానని, అలాగే ఈ ఏడాది విడుదలైన ‘శతమానం భవతి’ సినిమా కూడా ఫ్లాప్ అవుతుందని దిల్ రాజుకు తెలియజేశానని, అదేంటి మిక్కీ, ‘ఇది హిట్ సినిమా… నువ్వేంటి అలా చెప్తున్నావు?’ అని అడిగారని, చివరకు దిల్ రాజు గారి నిర్ణయమే కరెక్ట్ అయ్యిందని, అందుకే ఇక నుండి ఇలా ముందుగానే ఫలితాల గురించి మాట్లాడబోనని మిక్కీ తెలిపారు.

ఇలా పోతాయని అంచనాలు వేసిన సినిమాలు అనూహ్య విజయం సాధించగా, సూపర్ గా ఆడతాయని చెప్పిన సినిమాలు కూడా పోయాయని తన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. ఇక, ఇటీవల ఇళయరాజా – ఎస్పీ బాలు విషయంలో చోటుచేసుకున్న పాటల రైట్స్ వివాదం గురించి స్పందించిన మిక్కీ, ‘తన వరకు వచ్చేసరికి తన పాటలు ఎవరైనా పాడుకోవచ్చని, నిజానికి అలా పాడితేనే ఇంకా ప్రజాధరణ పొందుతాయని తాను నమ్ముతానని’ తన భావాలను వ్యక్తపరిచారు ఈ మెలోడీ మ్యూజిక్ డైరెక్టర్.