Merugu Nagarjuna Welfare ministerదేశంలో మిగిలిన రాష్ట్రాల మాటేమోగానీ ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమశాఖ మంత్రి పదవికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే, ఏపీలో నవరత్నాలు పొదిగిన సంక్షేమరాజ్యం నడుస్తోంది కనుక. ఏపీలో ఆర్ధిక, రెవెన్యూ, హోం శాఖల తరువాత సంక్షేమ శాఖ అత్యంత కీలకమైనదని చెప్పక తప్పదు. ఇటువంటి కీలకమైన శాఖకు మంత్రిగా మేరుగ నాగార్జున ఈరోజు బాధ్యతలు చేపట్టారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, “సిఎం జగన్మోహన్ రెడ్డి డాక్టర్ అంబేద్కర్ ఆలోచన, బాబూ జగజ్జీవన్ రామ్ కాన్సెప్ట్ తో పరిపాలన చేస్తున్నారు. రాష్ట్రంలో దళితులందరికీ మేలు చేయాలని తపిస్తుంటారు. నేను ఆయన నాయకత్వంలో రాష్ట్రంలో దళితుల సంక్షేమం కోసం పనిచేస్తాను,” అని అన్నారు.

ప్రస్తుతం ఏపీలో అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన వంటి రెండు డజన్లకు పైగా సంక్షేమ పధకాలున్నాయి. ఇవికాక రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలలో చదువుకొనే విద్యార్ధులు, సంక్షేమ హాస్టళ్ళలో ఉండి చదువుకొంటున్నవారు లక్షలమంది ఉన్నారు. వారందరికీ వసతి, ఆహారం, బట్టలు, పుస్తకాలు, చదువులకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తోంది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి నానాటికీ దిగజారుతున్నప్పటికీ ప్రభుత్వం అప్పులు తెచ్చి వీటన్నిటినీ కొనసాగిస్తోంది.

పుష్కలంగా నిధులు చేతులో ఉంటే సంక్షేమశాఖ బంగారుబాతువంటిదే కావచ్చు కాని ఏ రోజుకారోజు డబ్బు కోసం తడుముకొంటున్నప్పుడు, ఈ శాఖను నిర్వహించడం అగ్నిపరీక్షే అవుతుంది. అదీగాక…సంక్షేమ పధకాలతోనే వచ్చే ఎన్నికలలో గట్టెక్కాలని సిఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నందున, వైసీపి భవిష్యత్‌ సంక్షేమ శాఖ పనితీరుపైనే ఆదారపడి ఉంటుంది. మరి కొత్త మంత్రిగారు మేరుగ నాగార్జున దీనిని ఏవిదంగా నడిపిస్తారో చూడాలి.