Mem Famous Movie Talkప్రమోషన్లతో ఆడియన్స్ ని ఆకట్టుకోవడం ఒక కళ. మేం ఫేమస్ టీమ్ ఇందులో బాగానే సక్సెస్ అయ్యింది. ఒక రోజు ముందు కేవలం 99 రూపాయలతో ప్రీమియర్లు వేస్తే దాదాపు అన్ని చోట్ల హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఏకంగా మహేష్ బాబే మెచ్చుకోవడంతో ఇందులో ఏముందబ్బాని ఆడియన్స్ లో ఆసక్తి కలిగిన మాట వాస్తవం. అందరూ కొత్త కుర్రాళ్లే నటించి పని చేసిన ఈ సినిమా మీద భారీ స్థాయిలో అంచనాలేం లేవు కానీ నిర్మాణ సంస్థ ఛాయ్ బిస్కెట్ చాలా నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ వచ్చింది.

తెలంగాణలో బండ్ల నర్సంపల్లి అనే గ్రామంలో మై(సుమంత్ ప్రభాస్)తో పాటు పనీపాటా లేకుండా ఖాళీగా తిరిగే మరో ఇద్దరు కుర్రాళ్లు, స్కూల్ పిల్లాడు కలిసి ఊళ్ళో లేనిపోని గొడవలన్నీ తెచ్చుకుని చివాట్లు తింటూ ఉంటారు. ఇంత జులాయిగా ఉన్నా వీళ్ళలో మై, బాలాకు లవర్స్ కూడా ఉంటారు. ఓ మంచి ముహూర్తంలో మారిపోవాలని నిర్ణయించుకుని టెంట్ హౌస్ దుకాణం పెడతారు. అయితే అనుకోని సంఘటన వీళ్ళ జీవితాన్ని తలకిందులు చేస్తుంది. దీంతో అప్పులు తీర్చుకునేందుకు ఇంకో ప్లాన్ వేస్తారు. చివరికి గెలవడం క్లైమాక్స్

సుమంత్ ప్రభాస్ తీసుకున్న లైన్ చాలా చిన్నది. ఇంకా చెప్పాలంటే యూట్యూబ్ లో ఒక గంటకు సరిపడా ఇండిపెండెంట్ మూవీకి చేసుకోవచ్చు. కానీ తనలో ఎంటర్ టైనింగ్ రైటర్ ని బలంగా నమ్ముకున్న ఇతను రెండున్నర గంటల సేపు నవ్విస్తూ చెబితే ఆడియన్స్ మెచ్చుకుంటారన్న ధైర్యంగా స్క్రిప్ట్ ని పొడిగించాడు. ఇంటర్వెల్ వరకు ఓ మోస్తరుగా సక్సెస్ అయ్యాడు కూడా. పక్కా తెలంగాణ యాసలో సంభాషణలు, పల్లెటూరు గుర్తొచ్చేలా స్వచ్ఛమైన వాతావరణం, కల్మషం లేని మనుషుల ప్రవర్తన ఇవన్నీ చాలా సహజంగా వచ్చాయి. తొలి అరగంట కొంచెం అటుఇటు ఊగినా టైం పాస్ జోకులతో నవ్విస్తూ యూత్ ని బాగానే మెప్పిస్తూ వచ్చాడు.

సెకండ్ హాఫ్ లో యూట్యూబ్ ప్రహసనం మొదలయ్యాక సుమంత్ ప్రభాస్ లో అసలైన తడబాటు బయటికొచ్చింది. హాస్యం పరంగా ఈ ఎపిసోడ్స్ బాగానే ఉన్నా మైగాడు ఏదో పొడిచేస్తాడని ఆశలు పెట్టుకున్న ఆడియన్స్ కు ఎంతసేపూ కథ ముందుకు కదలని ఫీలింగ్ వస్తుంది. పైగా తొలి సగంలో లవ్ టచ్ ఇచ్చిన అమ్మాయిలను విశ్రాంతి తర్వాత దాదాపుగా పక్కన పెట్టేసి అంజి మామ, లిప్ స్టిక్ కుర్రాడి కామెడీ మీద ఎక్కువ ఆధారపడటంతో థియేటర్ ఎక్స్ పీరియన్స్ క్రమంగా తగ్గుతూ పోయింది. దానికి తోడు కీలకమైన క్లైమాక్స్ లో నాటకీయత ఎక్కువైపోయి అప్పటిదాకా కాపాడుతూ వచ్చిన న్యాచులారిటీ ఎమ్మెల్యే ఎంట్రీతో రొటీన్ ట్రాక్ పట్టేసి చప్పగా అనిపిస్తుంది

సుమంత్ ప్రభాస్ లో టాలెంట్ ఉంది. యాక్టింగ్ టేకింగ్ రెండింటిలో గమనించవచ్చు. అయితే కామన్ ఆడియన్స్ యాంగిల్ లో అలోచించి అందరికీ మెచ్చేలా జాతిరత్నాలు టైపులో ఏదో చేద్దామనుకున్నాడు కానీ తన టైమింగ్ అంత బరువు మోయడానికి సరిపోలేదు. ముఖ్యంగా చివరి గంట చేతులెత్తేసిన వైనం స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్టిస్టులు బాగా కుదిరారు. అందరికన్నా అంజి, చైల్డ్ ఆర్టిస్ట్ శివనందన్ ఎక్కువ మార్కులు కొట్టేశారు. అన్నేసి పాటలు ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. రెండు బాగున్నాయంతే, నేపధ్య సంగీతం పర్వాలేదు. కర్చీఫ్ కి సరిపడా బట్టతో ఆరడుగుల బెడ్ షీట్ కుట్టలేం. అయినా సుమంత్ ప్రభాస్ రిస్క్ చేశాడు.