Mekapati Goutham Reddy - Vizag Steelతెలుగు ప్రజల పదేళ్ల పోరాట ఫలితంగా వచ్చిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ను ప్రైవేట్ పరం చెయ్యడానికి సిద్ధం అవుతుంది కేంద్ర ప్రభుత్వం. దీనిపై కార్మిక సంఘాలు, విశాఖవాసులు భగ్గుమంటున్నారు. కేంద్ర మెడలు వంచుతాం అంటూ బీరాలు పలికి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ కనీసం మీడియా ముందుకు వచ్చి ఇది తప్పు మేము ఒప్పుకోము అని చెప్పలేని పరిస్థితి.

నామ్ కే వాస్తే గా కేంద్రానికి మీ నిర్ణయాన్ని పునఃపరిశీలించండి అంటూ ఒక లేఖ రాసి సరిపెట్టారు. మరోవైపు… కేంద్రం తన నిర్ణయం మార్చుకోకపోతే… స్టీల్ ప్లాంట్ వేలంలో తాము పాల్గొని దానిని దక్కించుకుంటాం అని ప్రకటించేశారు మంత్రి మేకపాటి. అయితే మంత్రి గారి మాట ఆయన కాకుండా ముఖ్యమంత్రి గారితో చెప్పిస్తే మంచిది.

స్టీల్‌ ప్లాంట్‌ ను ప్రైవేట్ పరం చెయ్యడం ద్వారా 1.75 లక్షల కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది. ఇది దాదాపుగా ఒక ఏడాది రాష్ట్ర బడ్జెట్. అలాగే ప్లాంట్ పై రూ.22,000 కోట్ల రుణం కూడా ఉంది. పోనీ ఆ ఋణం మొత్తం మైనస్ చేసుకుని మిగతాది చెల్లించాల్సి వచ్చినా అది పెద్ద మొత్తమే.

ఇంత మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి ప్లాంట్ ని దక్కించుకుంటుంది అంటే నమ్మగలిగే లా ఉందా? పరిశ్రమల శాఖా మంత్రి కి ఆ మాత్రం తెలియదా? లేక ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారా? రాజకీయాలు మాని చిత్తశుద్దిగా పోరాటం చేస్తేనే స్టీల్ ప్లాంట్ ని దక్కించుకోగలం.